ఔను.. ఒక‌రిద్ద‌రి ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్‌

తెలంగాణ‌ను కుదిపేస్తున్న ఫోన్ల ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు. “ఔను.. ఒక‌రిద్ద‌రి ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చు“ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. దానికే ఇంత రాద్ధాంతం ఎందుకు అని ఎదురు ప్ర‌శ్నించారు. “ప‌ది లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్  చేశారని యూట్యూబుల్లో వీడియోలు పెడుతున్నారు. ఒకరిద్దరు  ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు. దానికే ఎందుకు ఇంత రాద్దాంతం ఎందుకు“ అని కేటీఆర్ ప్రశ్నించారు.  సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొద‌లుకుంటే యూట్యూబ్‌లో మొరిగే కుక్క‌ల దాకా.. అంద‌రికీ ప్ర‌జ‌లు ఓటుతోనే స‌మాధానం చెప్పాల‌న్నారు.

కేసీఆర్‌ను ప‌ట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే బాధ‌గా ఉంద‌ని కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయ‌న పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల్లో కేటీఆర్ పాల్గొన్నారు. “మల్కాజ్ గిరిలో జ‌రిగే పోటీ.. కేవ‌లం వ్య‌క్తుల మ‌ధ్య కాదు.. పోటీ మూడు పార్టీల మ‌ధ్య‌. కేసీఆర్ నిల‌బ‌డ్డారని భావించి ప‌ని చేయాలి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు సెగ్మెంట్ల‌లో తుఫానులా మెజార్టీ ఇచ్చారు. మూడు ల‌క్ష‌ల యాభై ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. కాబ‌ట్టి ఇప్పుడు ఇత‌ర పార్టీలు మూడున్న‌ర ల‌క్ష‌లు దాటి ముందుకు వ‌చ్చి గెల‌వాలి.“ అని దిశానిర్దేశం చేశారు.

కార్పొరేట్ ఎన్నిక‌ల్లో మాదిరిగానే ప్ర‌తి ఇంటికి వెళ్లాలన్నారు. దేశంలోనే అత్యంత పెద్ద నియోజ‌క‌వ‌ర్గం మ‌ల్కాజ్‌గిరి అని, కాబ‌ట్టి ప్ర‌తి వాడ తిరిగి ప్ర‌చారం చేయాలని కేటీఆర్ చెప్పారు. రాగిడి ల‌క్ష్మారెడ్డి కుటుంబ స‌భ్యులు బ్ర‌హ్మాండంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని కేటీఆర్ తెలిపారు. “కాంగ్రెసోళ్ల మాట‌లు వింటుంటే ర‌క్తం మ‌రుగుత‌ది. హైద‌రాబాద్‌లో త‌న్నిన‌ట్లే మ‌రోసారి మ‌ల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల‌లో జాడిచ్చి త‌న్నాలి“ అని పిలుపునిచ్చారు.  దాంతో వారి నోరు మూత ప‌డ‌వాలి. అడ్డ‌మైన కారు కూతలు మూత‌ప‌డాలంటే కారు వంద కిలోమీట‌ర్ల వేగంతో ఉర‌కాలని పిలుపునిచ్చారు.  

రేవంత్‌పై విమ‌ర్శ‌లు..

“రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మ‌నిషా..? రాహుల్ మ‌నిషా..? మోడీ మ‌నిషా..? అర్థం కావ‌డం లేదు. న‌రేంద్ర మోడీ దొంగ అని రాహుల్ అంటే, రేవంతేమో మోడీబ‌డే బాయ్ అంట‌డు. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాండ్ అంటుంటే.. అదానీ హ‌మారే ఫ్రెండ్ అంటుండు. గుజ‌రాత్ మోడ‌ల్ ఫేక్ అని రాహుల్ అంటుంటే.. రేవంత్ రెడ్డేమో తెలంగాణ‌ను గుజ‌రాత్ మోడ‌ల్ చేస్తా అంటుండు. మైనార్టీల కొంపలు పుచ్చుకుని, బుల్డోజ‌ర్ల‌తో ఇండ్లు కూల‌గొట్టి, దిక్కుమాలిన ప‌నులు చేసి హిందూ – ముస్లిం ఫీలింగ్ తెస్తావా..? లిక్కం స్కాం లేదు.. మ‌న్ను లేదు.. అర‌వింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయ‌డం త‌ప్పు అని రాహుల్ అంట‌డు.. రేవంత్ రెడ్డేమో క‌విత‌ను అరెస్టు చేయ‌డం క‌రెక్ట్ అని అంట‌డు“ అని స‌టైర్లు వేశారు.