టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తన చెల్లెళ్లను ( వైఎస్ షర్మిల- వివేకా కుమార్తె సునీత) ప్రయోగించి తనను ఓడించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. అన్నారు. అంతే కాదు.. “నా చెల్లెళ్లతో నన్ను ఓడించగలడా?“ అని చంద్రబాబును ప్రశ్నించారు. శవరాజకీయాలు, కుట్రలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలని వ్యాఖ్యానించారు. “అలవాటు కుట్రలు చాలవన్నట్లు.. నా చెల్లెళ్లు ఇద్దరిని తీసుకొచ్చుకున్నారు. ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. నన్ను ఓడిచండం చంద్రబాబుకు సాధ్యం కాదు“ అని జగన్ అన్నారు.
ఎన్నికల పర్యటనలో భాగంగా ఆయన తొలి రోజు కడపలో బస్సు యాత్ర ద్వారా పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అదేసమయంలో తాను చేస్తున్న సంక్షేమమే తనకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు. “పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా“ అని జగన్ ప్రశ్నించారు. మే 13న ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రజల్ని అడిగారు.
“వైఎస్సార్ జిల్లా నేలమీద… ఈ పొద్దుటూరు గడ్డమీద…నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టా లు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా“ అని జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదన్నారు. “ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడే“ అని తెలిపారు. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కీలకమైన డ్రగ్స్‌పై..
గత రెండు రోజులుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖలో వెలుగు చూసిన `డ్రగ్స్` అంశంపైనా సీఎం జగన్ స్పందించారు. “చంద్రబాబు వదినగారి(బీజేపీ చీఫ్ పురందేశ్వరి) చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తావుంటే సీబీఐ వాళ్లు రెయిడ్ చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలిసిన వెంటనే.. `యెల్లో బ్రదర్స్` ఉలిక్కి పడ్డారు. దొరికితే తమ బ్రదర్ కాదని.. మన బ్రదర్ అని మన మీద నెట్టేసే యత్నం చేశారు.“ అని అన్నారు.