టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం దేనిపై పెడతానో అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. తాను సీఎంగా నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానన్నారు. “మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా. ఎన్డీయే కూటమి అధికారం లోకి వచ్చాక తొలి రోజే తొలి సంతకం డీఎస్సీపై చేస్తా. అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుంది” అని అన్నారు. రాష్ట్రం లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
“మీరు (యువత) వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవండి. ఇప్పుడు డీఎస్సీ వద్దు అని చెప్పండి. ఎన్నికలు అయ్యాకే డీఎస్సీ జరపాలని కోరండి. మేం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి డీఎస్సీ గురించి మాట్లాడతాం” అని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో టీడీపీ 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు అదే రికార్డ్ అని, మళ్లీ అలాంటి రికార్డునే సృష్టిస్తామని చెప్పారు. తాము మెగా డీఎస్సీనే జరుపుతామని, గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు.
ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని మండిపడ్డారు. మీ జీవితాలను అంధకారం చేసిన జలగ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. “యువతను నాశనం చేశాడు. గంజాయి, మద్యానికి, కడాన డ్రగ్స్‌కు కూడా యువతను బానిసలను చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఈయన జగన్ కాదు.. యువత రక్తం పీల్చే జలగ. ఈయనను ఇంటికి పంపించేందుకు యువత అంతా ఏకం కావాలి. వారి తరఫున పోరాడేందుకు నేనున్నారు. నేను అధికారం చేపట్టిన వెంటనే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా“ అని చంద్రబాబు యువతకు తెలిపారు. కుప్పంలో ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే.