విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల రాజకీయాలు వేడెక్కాయి. ఈ టికెట్‌ను ఆశించిన టీడీపీ నేతలకు ఇంతకు ముందే లేదని తేల్చేశారు. దీంతో టీడీపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇక, ఇప్పు డు జనసేన వంతు వచ్చింది. ఈపార్టీ నాయకుడు.. పోతిన వెంకట మహేష్ ఈ నియోజకవర్గంపై ఆది నుంచి కొంత ఆశలు పెట్టుకున్నారు. దీనికి పవన్ హామీ కూడా తోడవడంతో ఆయనదే ఈ నియోజకవర్గం అనుకున్నారు. ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. మరోవైపు ఈ నియోజకవర్గంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
దీంతో టీడీపీ-జనసేన- బీజేపీ పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళ్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీటును బీజేపీకి ఇచ్చారని.. ఆ పార్టీ తరఫున సుజనా చౌదరి పోటీ చేయడం ఖాయమని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న పోతిన.. విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ ఆందోళనకు దిగుతున్నారు. అయితే.. దీనిపై జనసేన పెద్దల నుంచి ఎలాంటి సమాచారం లేదు.
రెండు రోజుల కిందట పవన్ నేరుగా పోతినను పిలిచి.. మాట్లాడి, ఈ సారి తప్పుకోవాలని సూచించారు. కానీ, తన పరిస్థితిని పోతిన పవన్‌కు వివరించారు. అయినప్పటికీ.. పవన్ కాదనే చెప్పారు. దీంతో పోతిన మహేష్ తాజాగా నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
“కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వేరే నియోజకవర్గానికి పంపించిది మా పోరాటం వల్లే. నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. రెండవ లిస్ట్‌లో నా పేరు ఉంటుంది” అని చెప్పడం గమనార్హం. అయితే.. ఆయన నిరాహార దీక్ష చేపట్టడం మాత్రం కలకలం రేపుతోంది. మరి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.