‘యూట్యూబ్’ చానెళ్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తన పార్టీపైనా తనపైనా వ్యక్తిగత విమర్శలు చేసేవారిని ప్రోత్సహిస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను ప్రసారం చేస్తున్నాయని అన్నారు.
డబ్బులకు ఆశ పడుతున్నారు!
అధికార పార్టీ ఇస్తున్న డబ్బులకు యూట్యూబ్ చానెళ్లు ఆశ పడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నా యని ఘాటుగా విమర్శించారు. చట్ట విరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఇది వ్యక్తిగతంగా తనతో పాటు, తమ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతోందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రజలను అయోమయానికి గురిచేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగానే భావిస్తున్నట్టు చెప్పారు.
కుట్రపూరిత చర్యలు..
యూట్యూబ్ చానళ్లు చేస్తున్న దుర్మార్గమైన, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన థంబ్ నెయిల్స్ తో వార్తల పేరిట దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం కేసులతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని అన్నారు.