కేశినేని బ్ర‌ద‌ర్స్‌ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్న బాబు, జగన్?

విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి కీల‌క పార్టీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న కేశినేని బ్ర‌దర్స్ ప‌ర‌స్ప‌రం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. నా ఫోన్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్యాప్ చేస్తున్నార‌ని.. ప్ర‌స్తుత ఎంపీ కేశీనేని నాని ఆరోపించ‌గా.. కాదు, నా ఫోనే సీఎం జ‌గ‌న్‌ ట్యాప్ చేస్తున్నారంటూ.. కేశినేని చిన్ని తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. ఇద్ద‌రూ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా రు. నాని నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలోనే ఉన్నారు. కానీ, ఆయ‌న పార్టీని విభేదించి వైసీపీకి జై కొట్టారు. త‌ర్వాత‌.. ఆయ‌న‌కు విజ‌యవాడ ఎంపీసీటును ఖ‌రారు చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న ఫోన్‌ను హైద‌రాబాద్ నుంచి చంద్ర‌బాబు ట్యాప్ చేయిస్తు న్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇక‌, ఇదే రోజు.. టీడీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచి త‌న అన్న నానిపై పోటీ చేస్తున్న‌ కేశినేని చిన్ని.. కూడా ఇవే వ్యాఖ్య‌లు చేశారు. నా ఫోన్ను సీఎం జ‌గ‌న్ ట్యాప్ చేయిస్తున్నారు. ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులు నా ఫోన్ ట్యాప్ చేసేందు కు ప్ర‌య‌త్నించారు. ఈ విష‌యాన్ని ఇంటిలిజెన్స్‌లో ప‌నిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు నాకు చెప్పారు. దీనిపై ఎన్నిక‌ల సంఘాని కి ఫిర్యాదు చేయ‌నున్నాం అని చిన్ని వ్యాఖ్యానించారు. దీంతో అన్న‌ద‌మ్ముల వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపాయి. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అంశం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో వెలుగు చూసింది. అయితే.. ఇప్పుడు ఏపీకి కూడా పాకింద‌నే అను మానాలు టీడీపీలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అయితే.. టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు రుజులు చూపించాల‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. అంతేకాదు.. టెక్నాల‌జీలో ఐకాన్ అని చెప్పుకొనే చంద్ర‌బాబే త‌మ ఫోన్లు ట్యాప్ చేస్తున్నార‌ని.. కొన్నాళ్ల కింద‌ట కొడాలి నాని కూడా వ్యాఖ్యానించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఏం చేసుకున్నా.. ఏమీ పీక‌లేర‌ని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. తాజాగా వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా ఉన్న కేశినేని నాని కూడా ఇదే మాట చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఫోన్లు ట్యాపింగ్ చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటేనని నాని అన్నారు. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుతో వైసీపీ వాళ్ల ఫోన్ ట్యాపింగ్ చేయించిన విష‌యం తన‌కు తెలుసున‌ని ఆరోపించారు.

తన ఫోన్ ను ప్రధాని మోడీ ట్యాపింగ్ చేయించారని గతంలో చంద్రబాబు ఆరోపించారని… ఇప్పుడు అదే మోడీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని కేశినేని నాని విమర్శించారు. తన ఫోన్ ను 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారని.. తన ఫోన్ ను ట్యాప్ చేసినా తనకేం భయం లేదని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారని మండిపడ్డారు.

త‌మ్ముడిపై ఇలాంటి వ్యాఖ్య‌లా?

కాగా, విజయవాడ లోక్ సభ స్థానంలో తనపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి, తన సొంత త‌మ్ముడ కేశినేని చిన్నిపై నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై అంద‌రూ నివ్వెర పోతున్నారు. టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని నాని అన్నారు. ఆయన నేర చరిత్ర, భూ కబ్జాలపై త్వరలో పుస్తకాలు వస్తాయని చెప్పారు. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే అని అన్నారు. దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయిందని వ్యాఖ్యానించారు. అయితే.. సొంత త‌మ్ముడిపై నేర చ‌రిత్ర అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ త‌ప్పుబ‌డుతున్నారు. రాజ‌కీయాల్లో ఇంత‌గా దిగ‌జారిపోవాలా? అని ప్ర‌శ్నిస్తున్నారు.