రాబోయే ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసేందుకు డిజిటల్ కరెన్సీ రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు మాదిరిగా రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను వైసీపీ నేతలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలేనని దుయ్యబట్టారు.
ఏపీ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని, పొత్తుల వల్ల కొందరు నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం పనిచేసిన 31 మందికి టికెట్ ఇవ్వలేకపోయానని, వారి సేవలను మర్చిపోనని చెప్పారు. కూటమి తరఫున బరిలో దిగే ప్రతి అభ్యర్థి గెలవాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. అభ్యర్థి ఏ పార్టీ వారైనా ఎన్డీయే అభ్యర్థిగానే చూడాలని, ఈ మూడు పార్టీలు వేసే పునాది 30 ఏళ్ల భవితకు నాంది అని అన్నారు. ఏపీలో కూటమి 160కి పైగా సీట్లు గెలుస్తుందని, కేంద్రంలో ఎన్డీయే కూటమి 400కి పైగా స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజీనామా ఫేక్ లెటర్ పై చంద్రబాబు స్పందించారు. వైసీపీ చేసే ప్రతి పని ఫేక్ అని, టెంపరరీ పొత్తు అని తన పేరుతోనూ ఫేక్ లెటర్లు వదిలారని చంద్రబాబు మండిపడ్డారు.
“దగ్గుబాటి పురందేశ్వరి నా కుటుంబానికి చెందిన వ్యక్తే కావొచ్చు… కానీ ఆమె 30 ఏళ్లుగా ఇతర పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో అనేక ఫేక్ వార్తలు తీసుకువచ్చారు. జనసేన, పవన్ కల్యాణ్ పైనా ఫేక్ వార్తలు వచ్చాయి” అని చంద్రబాబు అన్నారు.