రాజకీయాల్లో భయంకరమైన మార్పులు.. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఊపిరాడినవ్వని వైనం.. కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. తెలంగాణ తెచ్చానని చెప్పుకొనే ఆయన నాయకత్వానికి ఇప్పుడు పెను సవాల్ ఎదురైంది. ఆయన మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కుమార్తె.. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి కూడా జంపింగ్ జాబితాలో చేరిపోయారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ బాట పట్టడం.. ఆయన ఏకంగా పార్లమెంటు టికెట్ కూడా దక్కించుకోవడం తెలిసిందే.
ఈయనతో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు చేస్తున్న బుజ్జగింపు రాజకీయాలు ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. మరోవైపు కీలకమైన హైదరాబాద్ నగర మేయర్, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితమే సీఎం రేవంత్ ను విజయలక్ష్మి కలిశారు. అప్పట్లో కేవలం నగర అభివృద్దికి సంబంధిం చిన ప్రణాళికపై మాత్రమే చర్చించేందుకు సీఎంను కలుసుకున్నట్టు ఆమె చెప్పారు. అసలు రాజకీయాలు ఏమీ మాట్లాడలేదన్నారు. ఇక, రేవంత్ సైడ్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ, ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా వీరితో పాటు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో, విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయింది. వాస్తవానికి హైదరాబాద్ నగర మేయర్ పదవికి ఎంతో మంది పోటీలో ఉన్నారు. అయినప్పటికీ.. కేశవరావు కారణంగా ఆయన కుమార్తెగా ఆమె దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె పార్టీ మారుతుండడం వెనుక కేశవరావు ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ప్రస్తుతం రెండు రోజులుగా కేశవరావు ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని బీఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates