ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులెవరు.? ఎప్పటినుంచి బీజేపీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు.? అన్న ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడంలేదు.
కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. టీడీపీ – జనసేన – బీజేపీ కలిసి నిర్వహించిన ‘ప్రజా గళం’ బహిరంగ సభలో పాల్గొన్నారు. నిజానికి, అది టీడీపీ కార్యక్రమం. మూడు పార్టీలూ పొత్తులో వున్నాయి గనుక, ఉమ్మడి కార్యక్రమం అయ్యింది.
జనసేన నుంచి అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయిపోయినట్లే. కొన్ని సీట్లను ప్రకటించాల్సి వుంది. టీడీపీ పరిస్థితి కూడా దాదాపు అంతే. బీజేపీ విషయంలోనే గందరగోళం. బీజేపీకి పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లను టీడీపీ – జనసేన కేటాయించిన సంగతి తెలిసిందే.
సరే, అభ్యర్థుల ప్రకటన కాస్త ఆలస్యమైనా, ఎన్నికల ప్రచారంలో బీజేపీ కూడా జోరందుకోవాలి కదా.? కూటమి అభ్యర్థుల తరఫున బీజేపీ శ్రేణులు అక్కడక్కడా కనిపిస్తున్నా, కనిపించాల్సిన స్థాయిలో హంగామా కనిపించడంలేదు.
టీడీపీ పట్ల వున్న వ్యతిరేకతతో ఏపీ బీజేపీ నేతలు కొందరు ఇంకా సెటైర్లు వేస్తూనే వున్నారు. ఇది మొత్తంగా కూటమికే ఇబ్బందికరం. కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాల్సి వుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రమే, హంగామా చేస్తే సరిపోదు కదా.?
నిజానికి, ఈ పొత్తు బీజేపీలో కొందరు వైసీపీ అనుకూల నేతలకు నచ్చడంలేదు. కానీ, అధినాయకత్వం ఆదేశాల మేరకు టీడీపీతో కలిసి పని చేయాల్సి వుంటుంది. అదే అసలు సమస్య. బీజేపీ అధినాయకత్వం వున్న పళంగా ఈ గ్యాప్ తగ్గించే ప్రయత్నం చేయకపోతే, బీజేపీ నిర్లక్షం వైసీపీకి అనుకూలంగా మారే అవకాశముంటుంది.