వైజాగ్ డ్రగ్స్.! తెరవెనుక కథేంటి.?

ఆక్వా పరిశ్రమ ఒకటి బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్‌ని తెప్పించుకుంది. అందులో నార్కోటిక్ ట్రేసెస్ వున్నాయని తేలింది. విశాఖ పోర్టులో సీబీఐ ఈ మేరకు సదరు కంటెయినర్‌ని సీజ్ చేసింది. ఇదీ అసలు విషయం.! పాతిక వేల కిలోల డ్రగ్స్.. అంటూ ప్రచారం తెరపైకొచ్చింది. అంతే, నానా పొలిటికల్ యాగీ షురూ అయ్యింది.

సదరు డ్రై ఈస్ట్‌ని తెప్పించిన సంస్థకి వైసీపీతో సన్నిహిత సంబంధాలుండడంతో విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసింది తెలుగు దేశం పార్టీ. ఇంకేముంది.? టీడీపీ నేతలకు, ఆ డ్రగ్స్‌తో సంబంధాలంటూ వైసీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవురాయులపై పెద్దయెత్తున వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారానికి తెరలేపింది.

ఈ వ్యవహారంపై ఆచి తూచి స్పందించారు లావు శ్రీకృష్ణదేవరాయలు. డ్రై ఈస్ట్‌ని దిగుమతి చేసుకోవడానికి సంబంధించి తాము పాటించిన నియమ నిబంధనల వ్యవహారాన్ని సదరు కంపెనీ వెల్లడించగా, ఆ విషయాల్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారాయన.

ఇంతకీ, డ్రగ్స్ సంగతేంటి.? ఎంత మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి.? కేవలం డ్రగ్స్ ఆనవాళ్ళు మాత్రమేనా.? ఎన్నికల వేళ ఈ డ్రగ్స్ హంగామా ఏంటి.? అని ఆలోచిస్తే.. అదో పెద్ద ప్రసహనం.

కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. కానీ, ఆ కేసు చివరికి నీరుగారిపోయింది. చాలా వరకు డ్రగ్స్ కేసుల్లో జరిగేది ఇదే. సినీ ప్రముఖులే అంత తేలిగ్గా తప్పించుకున్నప్పుడు, రాజకీయ పార్టీలు దొరుకుతాయా.? ఛాన్సే లేదు.