150 కోట్లు… బీజేపీకి ఇచ్చిన కంపెనీనే వైసీపీకీ ఇచ్చింది!

ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం ఎంత త‌వ్వుతుంటే అంత లోతుగా అనేక విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన వ్య‌వ‌హారం మ‌రింత విస్మ‌యానికి గురిచేస్తోంది. బీజేపీకి ఇచ్చిన ఓ కంపెనీనే.. వైసీపీకి కూడా రూ.150 కోట్ల‌ను విరాళంగా ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? బాండ్ల సీరియల్‌ నంబర్లు ఇందులో ఉన్నాయి.

అత్యధికంగా రూ.1368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసిన ‘ఫ్యూచర్‌ గేమింగ్‌’ అనే కంపెనీ ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఏకంగా రూ.150 కోట్లను బాండ్ల రూపంలో ఇచ్చింది. అయితే.. ఇదే కంపెనీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రూ.50 కోట్లు విరాళం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో బీజేపీకి ఇచ్చిన కంపెనీనే వైసీపీకి విరాళం ఏంట‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనివెనుక ఏమైనా వ్యూహం ఉందా? అనే చ‌ర్చ కూడా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ ఈ కంపెనీ ఎవ‌రిది? ఏంటి? అనే విష‌యం చూస్తే.. ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీ. ఈ సంస్థ యజమాని శాంటియాగో మార్టిన్‌. తొలినాళ్లలో మయన్మార్‌లో కూలీగా పనిచేశారు. 1988లో భారత్‌కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. దానిని కర్ణాటక, కేరళకు విస్తరించారు. ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ లాటరీ ట్రేడ్‌ అండ్‌ అలైడ్‌ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్‌ వ్యవహరిస్తున్నారు.

ఈ సంస్థ‌లే ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది. ఫ్యూచర్‌ గేమింగ్ సంస్థపై వివాదాలు కూడా భారీగానే ఉన్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలుమార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. కాగా, గుడివాడ, హైద‌రాబాద్ శివారులో ఏడాది కింద‌ట వెలుగు చూసిన క్యాసినో వ్య‌వ‌హారానికి ఫ్యూచ‌ర్ గేమింగ్ సంస్థ‌కు సంబంధం ఉండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. వైసీపీకి మాత్రం కోట్లు కురిశాయ‌ని అంటున్నారు విప‌క్ష నాయ‌కులు.