ఢిల్లీ సీఎం అరెస్టు.. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం 6 గంట‌ల‌కు కోర్టు తాము అరెస్టు నుంచి కాపాడ‌లేమ‌ని తేల్చి చెప్పిన ద‌రిమిలా ఆయ‌న అరెస్టు ఖాయ‌మ‌నే వాద‌న వినిపించింది. ఇక‌, సుమారు రెండు గంట‌ల పాటు సీఎం ఇంట్లో సోదాలు నిర్వ‌హించిన అధికారులు.. అనంత‌రం ఆయనను అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో కేజ్రీవాల్ నిర‌స‌న వ్య‌క్తం చేసినా.. అధికారులు బ‌ల ప్ర‌యోగం చేయాల్సి ఉంటుంద‌ని తేల్చిచెప్పారు. దీంతో కేజ్రీవాల్ మౌనంగా అరెస్టుకు స‌హ‌క‌రించారు.

దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఈ రాత్రికే ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కోర్టుకు హాజ‌రు ప‌రిచే అవ‌కాశం ఉంది. ఆయ‌న‌కు కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయితే.. ఇప్పుడు ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ అరెస్టు చేస్తారా? అంటే.. లేద‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. నేను రాజీనామా చేయ‌ను.. సీఎంగానే జైలు నుంచి పాల‌న సాగిస్తాన‌ని కొన్నాళ్ల కింద‌టే చెప్పారు.

రాజ్యాంగం ప్ర‌కారం.. సీఎంను అరెస్టు చేసినంత మాత్ర‌న రాజీనామా చేయాల్సిన అవ‌స‌రం లేదు. అసలు.. ఆ క్లాజే ఎక్క‌డా రాజ్యాంగంలో పేర్కొన‌లేదు. ఎందుకంటే ఈ దేశంలో ముఖ్య‌మంత్రుల‌ను అరెస్టు చేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని రాజ్యాంగ నిర్మాత‌లు ఊహించుకుని ఉండ‌రు. ఇదిలావుంటే.. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టు అయినా.. ఆయ‌న పాల‌న జైలు నుంచి సాగించాల‌ని భావించినా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ఎవ‌రినో ఒక‌రిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

గ‌తంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ను ఆదాయానికి మించిన ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసు లో జ‌య‌ల‌లిత‌ను అప్ప‌ట్లో అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో ఆమె కూడా రాజీనామా చేయ‌లేదు. అయితే.. ఆమె త‌న‌కు ప్ర‌త్యామ్నాయంగా ప‌న్నీర్ సెల్వంను యాక్టింగ్ ముఖ్య‌మంత్రిని చేసి త‌మిళ‌నాడును పాలించారు. వారానికి రెండు సార్లు ప‌న్నీర్ సెల్వం జైలుకు వెళ్లి పాల‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలిపి.. జ‌య ఆదేశాల ప్ర‌కారం పాల‌న చేశారు సో.. ఇప్పుడు కూడా అదే జ‌రిగే అవ‌కాశం ఉంది.