పొత్తుల్లో భాగంగా సీట్లు పోవడం.. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న నాయకులకు ఇబ్బందులు ఏర్పడ డం.. వారిని సముదాయించలేక పార్టీలు సతమతం అవుతుండడం తెలిసిందే. ఈ పరంపరలో తాజాగా జనసేన కూడా తెరమీదికి వచ్చింది. ఈ పార్టీలోనూ చాలా మంది నాయకులు పార్టీ టికెట్లు ఆశించారు. ఆశించడమే కాదు.. వారికి పవన్ నుంచి గట్టి హామీలు కూడా వచ్చాయి. అయితే.. అంతా అనుకున్నా.. పొత్తుల తర్వాత.. త్యాగాలు చేయక తప్పలేదు. ఎంతగా అంటే.. పవన్ అన్న నాగబాబు సైతం పోటీకి దూరంగా ఉండేంతగా!
అయితే.. అందరూ అలా ఉండరు కదా! ఇదే ఇప్పుడు జనసేనకు ఇబ్బందిగా మారింది. పార్టీకి చెందిన బీసీ నాయకుడు, విజయవాడ వెస్ట్ సీటు ఆశించి.. పవన్ నుంచి గతంలో హామీ కూడా పొందిన పోతిన వెంకట మహేష్ ఇప్పుడు రెబల్ అవతారం ఎత్తారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని ఆయన చెప్పేశారు. అది కూడా తాను రెబల్ అభ్యర్థిగానే రంగంలోకిదిగుతున్నాని చెప్పారు. తాజాగా ఈ వ్యవహారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దకు చేరింది.
ఈ సీటు జనసేనకే ఇవ్వాలని పోతిన మహేశ్ కోరారు. అయితే, టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు త్యాగం చేయాల్సిందేనని పవన్ తేల్చిచెప్పారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలని మహేశ్ పట్టుబట్టారు. కానీ, జనసేనాని కుదరదని చెప్పడంతో రెబల్‌గా బరిలోకి దిగాలని పోతిన నిర్ణయించుకున్నారు. ఇదే విషయం పవన్‌కు చెప్పి, తాను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.
విజయవాడ వెస్ట్‌లో పోతిన మహేశ్‌కు మద్దతుగా జనసేన కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేశ్‌కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. వారం రోజులుగా వారు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం చేస్తున్నారు. అయినప్పటికీ.. పవన్ ఇవ్వక పోవడంతో తాను రెబల్‌గా అయినా.. పోటీ చేస్తానని తేల్చి చెప్పడం గమనార్హం. ఇక, మిగిలింది.. మహేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates