కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌పై నిన్న మొన్నటి వరకు తీవ్రస్థాయిలో యుద్ధం చేసిన షర్మిల.. ఇప్పుడు అనూహ్యంగా ఆయనను తన తమ్ముడేనని వ్యాఖ్యానించారు. వైఎస్ అవినాష్ నా తమ్ముడే. కానీ, ఏం ప్రయోజనం. కడపలో రెండు సార్లు ఎంపీగా విజయం దక్కించుకున్నారు. కానీ, ఒక్క పని కూడా చేయలేదు అని వ్యాఖ్యానించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్, తనకు కూడా సొంత కజిన్ అని… అయినా, కడపకు ఆయన చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ ను అవినాష్ ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే పోటీకి తాను సిద్ధమని అన్నారు.
పార్టీ ఆదేశిస్తే కడప నుంచి కూడా పోటీకి సిద్ధమే అని షర్మిల వ్యాఖ్యానించారు. తాజాగా విజయవాడ లోని పార్టీ కార్యాలయంలో కడప నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారూ… ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఎప్పుడూ తమ గురించే ఎందుకు ఆలోచిస్తున్నారు? అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం అవినాష్ రెడ్డి ఎందుకు పోరాటం చేయలేదో జగన్, సజ్జల చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో 1,500 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, సర్వేలు జరుగుతున్నాయని… అధిష్ఠానం ఆమోదం తర్వాత త్వరలోనే కాంగ్రెస్ జాబితా ఉంటుందని తెలిపారు.
తాను ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధమేనని షర్మిల చెప్పారు. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, తన సోదరి సునీత పోటీ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఆమె కూడా రాజకీయాల్లోకి వస్తే బాగానే ఉంటుందన్నారు. అరాచక శక్తులకు అడ్డుకట్ట వేయాలంటే.. వైఎస్ కుటుంబం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates