మొత్తనికి ఏపీ పై ఫోకస్ పెట్టిన బీజేపీ

ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్ప‌టికే ఒక‌సారి ప్ర‌దాని న‌రేం ద్ర మోడీ ఏపీలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌కు వ‌చ్చి.. ఎన్డీయే కూట‌మిని గెలిపించాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి ఎన్డీయే కూట‌మి అవ‌స‌రం ఎంత ఉందో కూడా ఆయ‌న వివ‌రించారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో ఏపీపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. కొత్త‌గా ఇంచార్జిని నియ‌మించింది. ఈయ‌న నేతృత్వంలోనే ఏపీలో బీజేపీ నేత‌లు ప‌నిచేయాల్సి ఉంటుంది.

ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన ఇప్పటికే పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించగా, బీజేపీ కసరత్తులు చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఏపీలో 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఈ సీట్ల‌ను గెలిచే నాయ‌కుల‌కే ఇచ్చేలా.. ముఖ్యంగా సీనియ‌ర్ల‌కు అవ‌కాశం క‌ల్పించేలా క‌మ‌ల నాథులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సీట్ల పంప‌కంపై ఢిల్లీ వేదిక‌గా చ‌ర్చలు సాగుతున్నాయి.

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను ప్రకటించింది. ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ లకు బాధ్యతలు అప్పగించారు.

వీరు పార్టీ నాయ‌కుల‌ను ముందుండి న‌డిపించ‌నున్నారు. వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ముందుకు సాగించ‌నున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని స‌హా కేంద్ర మంత్రులు పాల్గొనే స‌భ‌లు, స‌మావేశాల‌కు కూడా వీరే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కూడా వీరు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నున్నారు. ఒక‌వైపు ప్ర‌చారం.. మ‌రోవైపు అధికార ప‌క్షానికి కౌంట‌ర్ల‌తో వీరి రాజకీయ వ్యూహాలు.. ఎన్నిక‌ల వ్యూహాలు ఉండ‌నున్నాయి.

అదే సమయంలో రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్చార్జిలను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్ ఇన్చార్జిలుగా వినయ్ సహస్రబుద్ధే, విజయ రహాత్కర్, ప్రవేశ్ వర్మ… హర్యానా ఇన్చార్జిలుగా సతీశ్ పునియా, సురేంద్ర సింగ్ నాగర్ లను నియమించిం ది. వీరు కూడా ఆయా రాష్ట్రాల్ల బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల్సి ఉంటుంది.