దేశంలో ఎన్నికల నగారా మోగింది. దీంతో విస్తృత స్థాయిలో ప్రచారానికి పార్టీలు శ్రీకారం చుట్టాయి. పైగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్‌కు పోలింగ్‌కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని, ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో.. ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రాలను చుట్టేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటు న్నా రు. దీనిలో భాగంగా మెజారిటీ పార్టీల నాయకులు.. హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు.
ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా హెలికాప్టర్లను, విమానాలను వినియోగించకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ప్రచారాన్ని కూడా అదేస్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నారు. ఫలితంగా చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్ 40 శాతం ఎక్కువగా ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విమానాలతో పోలిస్తే హెలికాప్టర్లకు మరింత ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రాంతీయ పార్టీలు హెలికాప్టర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కడికైనా వెళ్లగలిగే సౌలభ్యం ఉన్నందున ప్రాంతీ య రాజకీయ పార్టీలు హెలికాప్టర్ల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతాయి. దీంతో విమానాలు, హెలికాప్టర్లను సంబంధిత సంస్థల నుంచి రోజుల ప్రాతిపదికన, వారాల ప్రాతిపదికన కూడా అద్దెకు తీసుకుంటారు. డిమాండ్‌ను బట్టి హెలికాప్టర్లకు గంటకు లక్షా 50 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ.. హెలికాప్టర్లకు మరింత డిమాండ్ పెరిగితే.. ఇది అద్దెలపై ప్రభావం చూపనుంది. ఆ సమయంలో అద్దె గంటకు 3 లక్షల 50 వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు 30 నుంచి 40 శాతం డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీల మధ్య పోటీ.. రాజకీయాల్లో ఉన్న నేతల ఆర్థిక శక్తి పెరగడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
హెలికాప్టర్ల వినియోగంలో జాతీయ పార్టీలదే హవాగా కనిపిస్తోంది. 2019-20 సంవత్సరానికి గాను విమానం, హెలికాప్టర్ల ప్రయాణాలకు బీజేపీ రూ.250 కోట్లు వెచ్చించింది. కాంగ్రెస్ పార్టీ రూ.126 కోట్లు ఖర్చు చేసింది. ఇక, తెలంగాణ, ఏపీల్లోనూ అధికార, విపక్షాలు హెలికాప్టర్లు వినియోగించనున్నాయి. ఏపీ అధికార పార్టీ వైసీపీ రెండు హెలికాప్టర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు వేర్వేరుగా ఒక్కొక్కటి చొప్పున వాడనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ కూడా హెలికాప్టర్‌కు ఆర్డర్ ఇచ్చారు. ఇక, గత ఎన్నికల్లో హెలికాప్టర్ వినియోగించిన బీఆర్ ఎస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.