‘ఉస్తాద్’ గ్లాస్ డైలాగ్‌పై ట్రోలింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం. మంగళవారం ముంబయిలో జరిగిన అమేజాన్ ప్రైమ్ మీట్‌కు టీం హాజరైంది. ఈ నేపథ్యంలో ఒక స్పెషల్ టీజర్ తయారు చేసి అక్కడ ప్రదర్శించారు.

అది తర్వాత సోషల్ మీడియాలోకి కూడా వచ్చింది. ఈ అనుకోని కానుక విషయంలో అభిమానులు చాలా ఎగ్జైట్ అయ్యారు. షూటింగ్ చేసింది తక్కువ రోజులే అయినా.. కొన్ని నెలలుగా సినిమా హోల్డ్‌లో ఉన్నా.. ఇంతలోనే రెండో టీజర్ వదిలేసరికి పవన్ అభిమానులు ఎంతో ఉత్సాహ పడ్డారు.

ఐతే రేసీగా సాగిన ఈ టీజర్లో మిగతా అంతా ఓకే కానీ.. పవన్ చెప్పిన డైలాగుల విషయంలోనూ స్పందన ఆశించినట్లుగా లేదు. పవన్ రాజకీయ ఉద్దేశాలకు తగ్గట్లుగా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గురించి పెట్టిన డైలాగు‌లు కొంచెం కృత్రిమంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

“గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది”.. “గ్లాసంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం” అంటూ రెండు డైలాగులు చెప్పాడు పవన్ ఈ టీజర్లో. ఇవి జనసేన గుర్తు గాజు గ్లాసు, జనసైనికులకు ఎలివేషన్ ఇవ్వడానికి పెట్టిన డైలాగులు అన్నది స్పష్టం. ఐతే ఈ డైలాగులు పవన్ అభిమానులకు పెద్దగా రుచిస్తున్న సంకేతాలు కనిపించడం లేదు.

ఏదో బలవంతంగా గ్లాసు, సైన్యం అంటూ ఇరికించారు తప్ప.. డైలాగులు సందర్భోచితంగా లేవని.. డైలాగుల్లో హరీష్ శంకర్ మార్కు పంచ్ మిస్ అయిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా “గ్లాసంటే సైజు కాదు సైన్యం” అనే డైలాగ్ బాగా ట్రోలింగ్‌కు గురవుతోంది.

‘సర్కారు వారి పాట’లో మహేష్ చెప్పిన “బ్యాంకు అంటే గుడి” అనేదే ఇప్పటిదాకా పేలవమైన డైలాగ్ అనుకునేవాళ్లమని.. ఇప్పుడు “గ్లాసంటే సైజు కాదు సైన్యం” దాని సరసన చేరుతోందని నెటిజన్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. దీని మీద బోలెడన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి.