గాజువాక, భీమవరం, తిరుపతి.. ఇలా మూడు నియోజకవర్గాలపై సంకేతాలు ఇచ్చి, చివరికి పిఠాపురం నియోజకవర్గంలో తాను పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, పిఠాపురం విషయమై జనసేనలో క్లారిటీ వున్నా, వైసీపీ శ్రేణుల్లో కొంత అయోమయం కనిపిస్తోంది.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వ్యూహాత్మకంగా పిఠాపురంలో మోహరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాకినాడ ఎంపీ వంగా గీత, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే, లక్ష మెజార్టీ పక్కా.. అని జనసేన శ్రేణులు ఫిక్స్ అయ్యాయి. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చాలాకాలంగా పిఠాపురంలో గ్రౌండ్ వర్క్ చేశారు అంతలా.! ఆయనే పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పిఠాపురం ఎంచుకున్నారు, ఉదయ్ కాకినాడ లోక్ సభకు పోటీ చేస్తారని తేల్చేశారు.
అయితే, ఇక్కడే ఓ మ్యాజిక్ వుంది. దాన్ని మైండ్ గేమ్ అని కూడా అనొచ్చు. బీజేపీ పెద్దలు తనను లోక్ సభకు పోటీ చేయమని సూచించినట్లుగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. లోక్ సభ, అసెంబ్లీ.. రెండిట్లోనూ పోటీ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కి బీజేపీ అధినాయకత్వం సూచించినట్లు గతంలో ప్రచారం జరిగింది. అది నిజమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తేటతెల్లమయ్యింది.
నామినేషన్లు వేసే సమయానికి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఎలాగైనా మారొచ్చనీ, వైసీపీని కన్‌ఫ్యూజన్‌లో పెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారనీ.. ఓ ప్రచారం తెరపైకొచ్చింది.
పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పంపకాలు జోరుగా సాగుతున్నాయి. అంతకు ముందు గాజువాక, భీమవరం, తిరుపతి నియోజకవర్గాల్లోనూ ఇలాగే జరిగింది. ఆ పంపకాల తాలూకు ఖర్చు కోట్లలో వుంటుందనేది ఓ అంచనా.
ఇప్పుడేమో పిఠాపురం వంతు.! వున్నపళంగా పవన్ కళ్యాణ్ ‘లోక్ సభ’కు పోటీ చేస్తానని ప్రకటిస్తే ఏంటి పరిస్థితి.? ఏముంది.. మళ్ళీ వైసీపీ మార్కు ఉరుకులాటే.!