వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన్ని రాజకీయంగా ఢీ కొట్టే సత్తా ఎవరికైనా వుందా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇలా వైఎస్ కుటుంబీకులే చాలాకాలంగా పులివెందుల నియోజకవర్గాన్ని ఏలుతున్నారు.! ఔను, ఏలుతున్నారనడమే కరెక్ట్.!
పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే చిన్న విషయం కాదు.. శాల్తీలు లేచిపోతాయ్.. అనే భావన ఒకటుంది. వైసీపీ శ్రేణులు ఇదే మాట చెబుతుంటాయ్ కూడా.! రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించే క్రమంలో, వైసీపీ మద్దతుదారులు పులివెందుల గురించి ఇచ్చే ఎలివేషన్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.!
ప్రత్యర్థి ఎవరు.? అన్న విషయం అనవసరం.. వైఎస్ కుటుంబం ఎలక్షనీరింగ్ ముందు ఎవరైనా బొక్కబోర్లా పడాల్సిందే. ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అదే వైఎస్ కుటుంబం నుంచి షాక్ తగలొచ్చు. షర్మిల పోటీ చేస్తారా.? సునీతారెడ్డిని బరిలోకి దింపుతారా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్.
వైఎస్ షర్మిల అయితే కడప ఎంపీ సీటుకు పోటీ చేసే అవకాశాలున్నాయి. సునీతా రెడ్డి, ఆమె తల్లి.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్ నుంచి బరిలో వుంటారేమో. టీడీపీ నుంచి బీటెక్ రవి రంగంలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆయన.
అవన్నీ పక్కన పెడితే, పులివెందులలో ఈసారి రాజకీయం ఒకింత ఆసక్తికరంగా మారింది.. అదీ మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా. వైఎస్ జగన్‌కి తిరుగే లేదు.. అనే స్థాయి నుంచి, రాజకీయ ప్రత్యర్థులు ‘వై నాట్ పులివెందుల’ అనేదాకా వెళ్ళింది పరిస్థితి.
‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పులివెందులలో ఓడిపోతారు..’ అనే ప్రచారాన్ని గట్టిగా విపక్ష పార్టీలు చేయగలుగుతున్నాయి. ఆ వాదనకు పులివెందులలోనూ కొన్ని గొంతుకలు వంత పాడుతుండడం గమనార్హం.
విపక్షాలు ఎంత కష్టపడ్డా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాకపోవచ్చుగానీ, జగన్ రాజకీయంగా కుదులయ్యేలా బొటాబొటి మెజార్టీతో మాత్రమే గెలుపు దక్కొచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. వైఎస్ వివేకానంద రెడ్డి డెత్ మిస్టరీ ఫ్యాక్టర్ ఏమైనా వర్కవుట్ అయితే, వైఎస్ జగన్
ఓటమి కూడా జరగొచ్చేమోనన్నది ఇంకొందరి అభిప్రాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates