టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు. ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం భారీ బహిరంగ సభ హిట్టయిన నేపథ్యంలో ఈ ‘ప్రజాగళం’ పేరుతోనే ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల తరఫున కూడా టీడీపీ కార్యకర్తలు పనిచేసేలా కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తగ్గకుండా వెంటనే ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు.
పర్యటనలు సాగేదిలా..
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి రోజూ ఉదయం ఒక నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులతో భేటీ అవుతారు. బూత్ కన్వీనర్ నుంచి మండల పార్టీ అధ్యక్షుల వరకూ 6 వేల మంది చురుకైన నేతలతో ఆయన చర్చిస్తారు. మేనిఫెస్టో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, వివిధ అంశాలపై పార్టీ వైఖరి, ఎన్నికల్లో పనిచేయాల్సిన తీరు మొదలైనవాటిని వివరిస్తారు. తర్వాత మధ్యాహ్నం ఇంకో నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం మరో నియోజకవర్గ కేంద్రంలో రోడ్లు నిర్వహిస్తారు. మూడో నియోజకవర్గంలో రాత్రికి బస చేస్తారు. ఇలా వరుసగా ఇరవై రోజులపాటు అరవై నియోజకవర్గాలను చుట్టేస్తారు.
దీని తర్వాత కొంత విరామం ఇచ్చి రెండో విడత పర్యటనలు ప్రారంభిస్తారు. “కేంద్రంలో ఎన్డీయేకు 400 స్థానాలు, రాష్ట్రంలో టీడీపీ కూటమికి 160 స్థానాలు రావాలన్నది మన లక్ష్యం. దీనికి ఒక్క సీటు కూడా తగ్గడానికి వీల్లేదు. ప్రజల్లో సానుకూల వాతావరణం ఉంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. దీనిని అందిపుచ్చుకోవాలి. ఈ లక్ష్య సాధన కోసం మన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలి” అని చంద్రబాబు తాజాగా సోమవారం రాత్రి నిర్వహించిన అంతర్గత సమావేశంలో పార్టీ నేతలకు సూచించారు.
ఎన్డీయే కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజాగళం పేరే సరైనదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రజాగళం సభల రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నాయి. కాగా, టీడీపీ ఇంకా 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాలు మరో రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అనంతరం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికలకు తగినంత సమయం ఉండడంతో కూటమిలో ఉత్సాహం పెల్లుబుకుతోందని చంద్రబాబు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates