క‌డ‌ప ఎంపీ బ‌రిలో ష‌ర్మిల‌!

పంతం నీదా-నాదా.. అన్నట్టుగా సాగుతున్న ఏపీసీసీచీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాలు చివ‌ర‌కు క‌డ‌ప‌కు చేరాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఆమె అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అనుకున్నా.. పార్టీ అధిష్టానం ఆమెను క‌డ‌ప ఎంపీ బ‌రిలో నిలవాల‌ని ఒత్తిడి చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో ష‌ర్మిల‌.. క‌డ‌ప నుంచి పోటీ చేయాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుత‌ సీఎం జ‌గ‌న్‌ త‌మ పార్టీని నాశ‌నం చేశార‌న్న ఆవేద‌న‌లో ఉన్న కాంగ్రెస్.. ఆయ‌న‌ను దెబ్బకొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలో ష‌ర్మిల‌ను క‌డ‌ప నుంచి పోటీ చేయాల‌ని ఏఐసీసీ వర్గాలు ఒత్తిడి తెచ్చాయని తెలుస్తోంది. జగన్ ను ఆయన సొంత ఇలాఖాలోనే దెబ్బ కొట్టాలని, అందుకు షర్మిలను పోటీలో నిలబెట్టడమే మార్గమని భావించిన‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలావుంటే ఏపీ, తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలిచే పార్టీ అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు.

ఈ నెల 25న లోక్ సభ అభ్యర్థుల జాబితాను ఏపీసీసీ విడుదల చేయనుందని, అందులో తొలి పేరు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలదేనని భావిస్తున్నారు. ఇదిలావుంటే, కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్‌ రెడ్డికే పార్టీ అధినేత, సీఎం జగన్ మ‌రోసారి టికెట్ ఇచ్చారు. అయితే.. జ‌గ‌న్ చిన్నాన్న‌ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న బెయిల్‌పై ఉన్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఏడాది అరెస్టు నుంచి త‌ప్పించుకునేందుకు అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

ఈ ప‌రిణామాలు అవినాష్‌ రెడ్డికి వ్యతిరేకత పెంచి ఓటర్లు కాంగ్రెస్ ను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు, వైఎస్ షర్మిల వైజాగ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. తాజాగా ఆమె కడప ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు.. పులి వెందుల నుంచి కూడా వైఎస్ వివేకా కుటుంబం పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. వివేకా స‌తీమ‌ణిని కాంగ్రెస్‌లోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.