ప్రవీణ్ కుమార్ రాజకీయం ఏమిటో అర్థం కావట్లేదు. ఇంతకాలం రాజకీయాల్లో చాలా ఆదర్శాలను వల్లెవేసిన ప్రవీణ్ చివరకు తాను కూడా సగటు రాజకీయ నేతని నిరూపించుకున్నారు. ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ స్వచ్ఛంద విరమణ తీసుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొంతకాలం తర్వాత బీఎస్పీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరపున కాగజ్ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా సుమారు 48 వేల ఓట్లు తెచ్చుకున్నారు.
అంటే ఇన్నివేలమంది ఓటర్లకు ప్రవీణ్ పైన నమ్మకం ఉన్నట్లే కదా. అలాంటిది ఏమైదో ఏమో సడెన్ గా బీఎస్సీకి రాజీనామా చేశారు. అలాంటిది సోమవారం కేసీయార్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. ఐపీఎస్ అధికారిగా విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి కేసీఆర్ టార్గెట్ గా ప్రవీణ్ చాలా ఆరోపణలు చేశారు. ప్రతిరోజు ప్రభుత్వంతో పాటు కేసీఆర్ పాలనపైన కూడా ప్రవీణ్ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. కేసీయార్ కు వ్యతిరేకంగా రాష్ట్రమంతా పర్యటించి బీఎస్సీకి కొంత ఊపుతెచ్చారు.
ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా కేసీయార్ వ్యతిరేకతను అయితే విడిచిపెట్టలేదు. అలాంటిది తెరవెనుక ఏమైందో ఏమో కేసీయార్ అనుకూల వైఖరిని వ్యక్తంచేసి ప్రవీణ్ అందరినీ ఆశ్చర్యపరిచారు. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటించి కేసీయార్ తో భేటీ అయ్యారు. దాంతో జనాలందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ తో పొత్తులో బీఎస్పీ నాగర్ కర్నూలు, హైదరాబాద్ లోక్ సభ సీట్లలో పోటీచేయబోతున్నట్లు ప్రవీణ్ ప్రకటించారు. అయితే ఊహించని రీతిలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తును బీఎస్సీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తోసిపుచ్చారు. దాంతో బీఆర్ఎస్ తో పొత్తు బీఎస్పీ అధినేత్రికి తెలీకుండానే ప్రవీణ్ ప్రకటించినట్లు అర్ధమైంది.
పొత్తును మాయావతి తోసిపుచ్చగానే ప్రవీణ్ బీఎస్సీకి రాజీనామా చేశారు. సోమవారం బీఆర్ఎస్ లో చేరబోతున్న ప్రవీణ్ తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు (ఎస్సీ) నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. ప్రవీణ్ రాజకీయ ప్రయాణం చూస్తుంటే ఈయన కూడా సగటు రాజకీయ నేతనే విషయం జనాలకు అర్ధమైపోయింది. చెప్పిన సిద్దాంతాలంతా కేవలం కథలేని అని జనాలు అర్ధం చేసుకున్నారు.