బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు హిడెన్ అజెండా ఇదే అంటూ అమలాపురం మాజీ ఎంపి హర్షవర్ధన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవిని సిఎంగా చేయటమే వీర్రాజు హిడెన్ అజెండాగా పనిచేస్తున్నట్లు మాజీ ఎంపి బయటపెట్టారు. అలాగే బిజెపి+జనసేన పార్టీలు రెండు కుళ్ళిపోయిన పార్టీలే అంటూ తీవ్రంగా మండిపడ్డాడు. ఎలా కుళ్ళిపోయాయంటే బిజెపి ఏమో మతంతో కుళ్ళిపోతే జనసేనేమో కులపరంగా కుళ్ళిపోయిందట. అందుకనే రెండు కలిసి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్దం కేసులో కుల రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు.
సరే హర్షకుమార్ మాటలే కాసపు నిజం అనుకుందాం. మాజీ ఎంపి మాటల్లో లాజిక్ ఏమిటో పరిశీలిద్దాం. మొదటగా చిరంజీవి విషయమే తీసుకుంటే చిరంజీవిని బిజెపి ఏ విధంగా సిఎం చేయగలదు. అంటే 2024 గాని లేకపోతే 2029లో కానీ బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందని హర్ష నమ్ముతున్నాడా ? 2024 ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లో పోటి చేయటానికి బిజెపికి అసలు పోటికి గట్టి అభ్యర్ధులు దొరుకుతారా ? అనేదే ఇంకా తేలలేదు. అలాంటిది చిరంజీవి సిఎం ఏమిటి ? అందుకు వీర్రాజు ప్రయత్నం చేయటమేంటో ? కాకపోతే వచ్చే ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవటానికి చిరంజీవితో ప్రచారం చేయించుకోవాలని బిజెపి అనుకుంటే అనుకోవచ్చు, తప్పులేదు.
ఇక మత, కుల రాజకీయాల గురించి చూద్దాం. నిజానికి బిజెపి మత రాజకీయాలు చేసే ఈ స్ధాయికి వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. బిజెపి ఎదుగుదలకు మతమే ప్రధాన ఆధారమన్న విషయంలో కొత్తేమీ లేదు. ఇక జనసేన కాపుల ఓట్లకోసం ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తోంది. పైకి చెప్పకపోయినా మొన్నటి ఎన్నికల్లో కాపుల ఓట్లకోసం పవన్ చాలానే ప్రయత్నించారు. కాకపోతే కాపులే పవన్ను పెద్దగా నమ్మలేదు. అందుకనే కాపులకు ఎంతో పట్టుందని ప్రచారంలో ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో కూడా జనసేనకు పెద్దగా ఓట్లు రాలేదు.
సామాజికవర్గం ఓట్లను రాబట్టుకోవాలనుకోవటం తప్పు కూడా లేదు. ఎందుకంటే టిడిపి కూడా అదే చేస్తున్నది. నిజానికి ఒకపుడు టిడిపికి బిసిలే పెద్ద దన్నుగా నిలబడేవారు. అయితే చంద్రబాబునాయుడు కొన్ని పొరపాటు నిర్ణయాల వల్ల బిసిల్లో చీలికవచ్చి కొందరు వైసిపికి కూడా మద్దతుగా నిలబడ్డారు. ఇక వైసిపి విషయం చూస్తే ఈ పార్టీకి రెడ్లపార్టీగా ముద్రపడింది. ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న రాయలసీమ రెడ్డి నేతల్లో అత్యధికులు ఇపుడు వైసిపిలోనే ఉన్నారు. కాబట్టి కులపరంగా జనసేన కుళ్ళిపోయిందని హర్ష ఒక్క జనసేన విషయంలోనే బాధపడక్కర్లేదు. అన్నీ పార్టీలు దాదాపు ఇదే పద్దతిలో ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates