టీడీపీ-బీజేపీ-జనసేన జత కట్టిన తర్వాత.. తొలిసారి జరుగుతున్న భారీ బహిరంగ సభ ప్రజాగళం. చిలక లూరిపేటలోని బొప్పూడి వేదికగా జరుగుతున్న ఈ సభపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత.. మూడు పార్టీలూ సంయుక్తంగా నిర్వహిస్తున్న తొలిసభ కావడం.. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు.. పరిస్థితులు అనూహ్యంగా మారిన నేపథ్యంలో నిర్వహిస్తున్న సభ కావడంతో సహజంగానే ఈ సభపై అంచనాలు పీక్ లెవిల్లో ఉన్నాయి.
తొలి రెండు రోజులు ఈ సభకు పెద్దగా ప్రచారం లభించలేదు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత.. టీడీపీ సోషల్ మీడియా ప్రజాగళంపై దృష్టి పెట్టింది. దీంతో క్షణాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున ప్రజాగళాని కి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. ఇక, ఈ సభతో కూటమి పార్టీల్లో జోరు ఖాయమనే వాదన విని పిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాత మిత్రుడు బీజేపీ. దీంతో పెద్దగా అరమరికలు ఏవీ లేకుండానే కలిసి పోవడం ఖాయమని అంటున్నారు.
ప్రధానంగా బీజేపీకి పెద్దగా సీట్ల షేరింగ్ కూడా లేకపోవడం.. సీట్ల కుమ్ములాటలు కూడా పెద్దగా ఉండవు. ఇక, కలిసి ముందుకు సాగడంలో తొలి ఘట్టం.. చిలకలూరిపేట నుంచే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యం లో ఈ సభపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను పూర్తిగా బీజేపీ చంద్రబాబుకే వదిలేసినట్టు తెలిసింది. ఇక పవన్ కూడా.. చంద్రబాబుకే ఈ బాధ్యతలు అప్పగించారని సమాచారం. దీంతో బాబు కనుసన్నల్లోనే బొప్పూడి సభ ఏర్పాట్లు.. జరిగాయి.
ఈ సభ ద్వారా.. టీడీపీ, బీజేపీ, జనసేన ఇచ్చే బలమైన పిలుపు.. వచ్చే ఎన్నికలను తీవ్రంగా ప్రభావం చేయనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం, అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం.. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న విమర్శలు తదితర ప్రధాన అంశాల సమాహారంగానే సభలో అగ్రనేతలు ప్రసంగాలు దంచి కొట్టే అవకాశం కనిపిస్తోంది.
ఇక, బొప్పూడి సభకు కోస్తా, సీమ జిల్లాల నుంచే కాకుండా.. అల్లంత దూరాన ఉన్న ఉత్తరాంధ్ర నుంచి కూడా మూడు పార్టీల కార్యకర్తలు పోటెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 10 లక్షలపైఆ జనాలు వస్తారని అంచనా వేస్తున్న మూడు పార్టీలూ ఆమేరకు ఏర్పాట్లు చేశాయి. మొత్తంగా ప్రజాగళం ఈ కూటమిలో కొత్త చైతన్యం తీసుకురావడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.