రాబోయే ఎన్నికలకు పోటీచేయబోయే అభ్యర్ధులను ప్రకటించిన పార్టీలు ఒక్క సీటును మాత్రం పెండింగులో పెట్టాయి. ఆ ఒక్కసీటు ఏమిటంటే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం. ఈ సీటును జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెండింగులో పెట్టారంటే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధి ఎవరో తేలకపోవటం వల్లే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో అనకాపల్లి పార్లమెంటు సీటులో బీజేపీ పోటీచేయబోతోంది. టీడీపీకి ఈ సీటులో గట్టి బలమే ఉంది. అయినా సరే నియోజకవర్గాన్ని బీజేపీకి వదిలేసింది.
బీజేపీ తరపున ఎవరు పోటీచేయాలన్న విషయం కమలంపార్టీలో తేలలేదు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు పేర్లు వినబడుతున్నాయి. నిజానికి ఈ ఇద్దరికీ అనకాపల్లితో ఎలాంటి సంబంధం లేదు. పైగా ఇద్దరు కూడా జనబలమున్న నేతలు కారు. అంతేకాకుండా బీజేపీకి కూడా ఎలాంటి బలంలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్ధి పోటీలో ఉన్నారన్నా, గెలుపుకు ప్రయత్నిస్తున్నారన్నా అచ్చంగా టీడీపీ, జనసేన నేతలు, క్యాడర్ బలంమీదే అన్న విషయం అర్ధమవుతోంది.
ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం రమేష్ కు చంద్రబాబు, పవన్ మద్దతుంది. ఇదే సమయంలో జీవీఎల్ కు బీజేపీలోని కొందరు కీలక నేతల మద్దతుంది. కాబట్టి ఇద్దరిలో అభ్యర్ధిగా ఎవరుంటారనేది కీలకమైంది. లేకపోతే మధ్యేమార్గంలో కొత్త అభ్యర్ధి తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కూటమి తరపున పోటీలోకి దిగబోయే అభ్యర్ధి ఎవరో తేలలేదు కాబట్టి జగన్ కూడా పార్టీ అభ్యర్ధిని పెండింగులో పెట్టినట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం ఎంపీగా డాక్టర్ సత్యవతి ఉన్నారు. సత్యవతికి జనాల్లో పెద్దగా నెగిటివ్ కూడా ఏమీలేదు.
కాబట్టి సత్యవతికే జగన్ మళ్ళీ టికెటిస్తారా ? లేకపోతే కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపుతారా అన్నది ఆసక్తిగా మారింది. ఎవరు పోటీలో ఉన్నా టికెట్ మాత్రం బీసీ సామాజికవర్గానికే అన్నది అర్ధమవుతోంది. ఉత్తరాంధ్రలోని పార్లమెంటు స్ధానాల్లో వైజాగ్ తర్వాత అనకాపల్లి లోక్ సభ సీటే కీలకమైంది. కాబట్టి వైసీపీ-కూటమి తరపున అభ్యర్ధులుగా ఎవరు పోటీచేయబోతున్నారన్నది ఆసక్తిగా మారుతోంది. మరి చివరకు ఎవరు పోటీలోకి దిగుతారో చూడాలి.