సరిగ్గా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాలుగు గంటల తర్వాత.. అంటే శనివారం రాత్రి 8-9 గంటల మధ్యలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి మరో ప్రాతిపదిక కూడా ఉంది. ప్రధాని మోడీ.. తెలంగాణలో శనివారం మధ్యాహ్నం పర్యటించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఆయన సభ పెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఆయన ఈ మాట అని.. అలా వెళ్లారో లేదో.. ఆ వెంటనే కేంద్రం నుంచి రాత్రి 9గంటల సమయంలో ఒక సంచలన ప్రకటన వచ్చింది.
అదే ఢిల్లీలో గత పదేళ్లుగా ఎటూ కొలిక్కిరాని ఏపీ భవన్ విభజన సమస్యకు పరిష్కారం. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏపీ భవన్‌ను విభజిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఈ మేరకు విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం తెలిపింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
ఎవరెవరికి ఎలా ఎలా.?
తెలంగాణకు: 8.254 ఎకరాలు రానున్నాయి. ఇందులో శబరి బ్లాక్‌లో మూడు ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు రానుంది.
ఏపీకి: 11.536 ఎకరాలు వస్తుంది. 5.781 ఎకరాల్లో ఉన్న స్వర్ణముఖి బ్లాక్, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.259 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి వస్తుంది. ఈ విభజన కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే జరిగింది. అది కూడా.. గత విభజన చట్టంలో పేర్కొన్న మేరకు, రెండు తెలుగు రాష్ట్రాలూ ఒక అంగీకారానికి వచ్చిన మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర హోం శాఖ సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, తెలంగాణలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. దీనిని తెలంగాణ ప్రయోజనంగా ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates