ఏపీ రాజకీయాలు చిత్రంగా మారాయి. తమకు టికెట్ దక్కని నాయకులు.. పార్టీలు మారుతున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్‌ను దగాకోరు.. నరహంతకులకు దాసోహం అయ్యారు అని విమర్శలు గుప్పించిన టీడీపీ నాయకులు, ఇటువైపు.. జగన్ అంతటి వాడు లేడని నెత్తీ నోరు బాదుకున్న నాయకులు కూడా.. టికెట్లు దక్కక పోవడంతో పార్టీలు మారిపోయేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఎస్సీ నేతలు ఇద్దరు ఉండగా.. వైసీపీ నుంచి ఓసీ నాయకుడు కూడా ఉన్నారు.
వైసీపీ నుంచి
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు చాలా మంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన నేతలు టీడీపీలో చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీని వీడారు. శుక్రవారం ఆయన రాజీనామా ప్రకటించారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం వేణుగోపాల్ రెడ్డి పని చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా తనకు సరైన గుర్తింపు దక్కలేదనే అసంతృప్తిలో ఆయన ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈయన నిన్న మొన్నటి వరకు జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు.
టీడీపీ నుంచి..
టీడీపీ నుంచి ఇద్దరు ఎస్సీ నాయకులు పార్టీని వీడుతున్నారు. వీరు వైసీపీతో టచ్‌లోకి వెళ్లిపోయారు. ఇద్దరూ మాజీ మంత్రులే కావడం గమనార్హం. ఒకరు పీతల సుజాత(మాల). పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గం నుంచి 2014లో విజయం దక్కించుకున్నారు. మంత్రి అయ్యారు. తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో రెండేళ్లకే పక్కన పెట్టారు. 2019లో టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడైనా టికెట్ ఇస్తారని భావించారు. కానీ, ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా సెల్ఫీ వీడియో చేసి మీడియాకు అందించారు. తాను వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు పార్టీ అనుచరులకు చెప్పారు.
ఇక, మరో నాయకుడు కొత్తపల్లి శామ్యూల్ జవహర్. ఈయన కూడా మాజీ మంత్రి. మాదిగ సామాజిక వర్గం నేత. 2014కు ముందు వరకు ఆయన టీచర్. ఆ ఎన్నికల్లో చంద్రబాబు పలిచి కొవ్వూరు టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచిన తర్వాత.. రెండేళ్లకు మంత్రిని చేశారు. గత ఎన్నికల్లో తిరువూరు టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, ఈ టికెట్ను ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. దీంతో నొచ్చుకున్న జవహర్.. వైసీపీకి చేరువయ్యారు. ఈయన గతంలో జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం. ముఖ్యంగా వివేకా హత్య కేసుపై అనేక ఆరోపణలతో నిత్యం మీడియాలో ఉన్నారు.