ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. ముఖ్యమంత్రి, అధికార వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన కుటుంబ సభ్యుల మాటల దాడి తీవ్రమవుతోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యులు జగన్ అండ్ కో మీదే వేళ్లెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.
వివేకా తనయురాలు సునీత.. తన తండ్రి హత్యలో జగన్, అవినాష్ రెడ్డి తదితరుల మీద తీవ్ర ఆరోపణలే చేశారు. తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ సైతం ఈ కేసులో జగన్ ప్రమేయం గురించి మాట్లాడుతూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా జగన్ సోదరి వైఎస్ షర్మిళ.. తన అన్న మీద తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేసింది.
వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన స్మారక సభలో తన అన్నకు తగిలేలా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిళ. ‘‘హంతకులు ఎవరో కాదు.. కుటుంబ సభ్యులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. బాధితులకు న్యాయం చేయకుండా వాళ్ల మీదే నిందలు వేస్తారా? ఇప్పటి వరకు హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. చిన్నాన్న చివరి క్షణం వరకు వైసీపీ కోసమే పని చేశారు. కానీ ఆయన్ని చంపడమే కాక వ్యక్తిత్వ హననం చేస్తున్నారు.
సాక్షి పత్రికలో పైన వైఎస్ ఫొటో ఉంటుంది. కింద ఆయన తమ్ముడి మీద, ఆయన కుటుంబం మీద వ్యక్తిత్వ హననం జరుగుతుంటుంది. జగనన్నా ఒక్కసారి మీరు అద్దం ముందు నిల్చుని ప్రశ్నించుకోండి. మీ మనస్సాక్షి ఏం చెబుతుందో వినండి. రాజశేఖర్ రెడ్డి గారు తన తోబుట్టువుల కోసం ఎంతో చేశారు. కానీ ఆయన వారసుడిగా మీరేం చేశారు’’ అని షర్మిళ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates