ఎన్నికల వేళ.. నాయకులు చెప్పే ఒక్క మాటకైనా వాల్యూ ఎక్కువగానే ఉంటుంది. అలాంటి ఒక్క వీడి యో విడుదల చేసినా.. దాని పవర్ వేరేగా ఉంటుంది. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా విడుదల చేసిన వీడియో దుమ్ము రేపుతోంది. షార్ట్ ఫిలిమే అయినా.. మాటలు.. మంత్రాలు, హామీలు లేకపోయినా.. ఈ వీడియో దుమ్ము రేపుతుండడం గమనార్హం. జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి విడుదల చేసి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఒక్క మాట కూడా లేకుండానే, ఒక్క వాదన కూడా లేకుండానే ఈ వీడియోను చిత్రీకరించారు. రాష్ట్ర ప్రజ లు 2019లో భారీ మెజారిటీతో వైసీపీకి పట్టకట్టారు. దీనిని సింబాలిక్‌గా ఒక రూంలోని సీలింగ్ ఫ్యాను తీవ్ర వేగంతో తిరుగుతున్నట్టుగా చూపించారు. అయితే.. ఇంత బలమైన మెజారిటీ లభించడంతో(అంత వేగం ) ఫ్యాను ఇష్టానుసారం తిరిగి.. రాజధాని, పోలవరం, ఇతర ప్రాజెక్టులు, అభివృద్ధి అనేది ఏమాత్రం పట్టిం చుకోలేదనే విషయాన్ని సింబాలిక్‌గా చూపించారు.
ఫ్యాను గాలి(పాలన)కి ప్రాజెక్టులు(పేపర్లుగా చూపించారు) కొట్టుకు పోతుండగా.. చెల్లాచెదురు అవుతుండ గా.. ఆ ఫ్యాను వేగాన్ని అదుపు చేసి.. ఆయా ప్రాజెక్టులను(పేపర్లు) ఒక చోటకు చేర్చి.. ఒక క్రమపద్ధతిలో వాటిని ఏర్చి కూర్చి.. వాటిపై `గాజు గ్లాసు`ను పెట్టడం, బ్యాక్ గ్రౌండ్‌లో `వందే మాతరం` మ్యూజిక్ రూపం లో వినిపించడంతో షార్ట్ ఫిలిం అయిపోతుంది. ఈ ఫిలింలో పవన్ స్వయంగా నటించినా.. ఎక్కడా ఆయన ఫేస్ కనిపించదు. ఎండింగ్‌లో మాత్రం.. `బీజేపీ-టీడీపీ-జనసేన` పార్టీల సంయుక్త సింబల్ మాత్రం దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.