బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పిలిచి.. చాలించి.. బుజ్జగించారు. టికెట్ ఇస్తామని కూడా చెప్పా రు. అయినా… ఆయన వినిపించుకోలేదు. రావడమైతే వచ్చారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ.. ఈ క్రమంలో చోటు చేసుకున్న హైడ్రామాకు తెర కూడా దించారు. కానీ, మనసు మాత్రం మార్చుకోలేక పోయారు. చివరకు తాను చేయాలని అనుకున్నదే చేస్తున్నారు. ఆయనే ఆరూరి రమేష్. బీఆర్ఎస్ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే.
తాజాగా ఆయన బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. బుధవారమే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. వరంగల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తన రాజీనామాను ప్రకటించడానికి ముందు బీఆర్ఎస్ నేతలు అడ్డుకుని ఆయనను బలవంతంగా హైదరాబాద్‌లో నందినగర్‌లోని అధినేత కేసీఆర్ ఇంటికి తీసుకొచ్చా రు. ఆయనతో సమావేశం అనంతరం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ప్రకటించి ఊహాగానాలకు తెరదించారు. ఈ హైడ్రామా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని కేసీఆర్ సమక్షంలో ప్రకటించిన ఆరూరి.. గంటలు కూడా గడవకముందే పార్టీకి భారీ షాకిచ్చారు. బీజేపీలో చేరేందుకు ఈ ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి హస్తినకి చేరుకున్నారు. బీజేపీ అగ్రనాయకులు నడ్డా సహాతో ఇతర ముఖ్య నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు ముహూర్తం బాగుండడంతో ఆయన పార్టీలో చేరిపోవడం కూడా ఖాయమని కూడా అంటున్నారు.
మరి కేసీఆర్ రాయబారం, ఆయన బుజ్జగింపులు ఫలించకపోవడం.. అధినేతే చెప్పినా.. పార్టీపై భరోసా కల్పించలేకపోవడం వంటివి ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీకి ఒకదాని వెంట ఒకటి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతుండడం.. నాయకులు అధినేత మాటను కూడా ఖాతరు చేయకుండా జారుకోవడం వంటివి ఇప్పుడు బీఆర్ ఎస్ ఉనికికే ప్రశ్నార్థకంగా మారడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates