పవన్ పోటీ చేసేది ఇక్కడి నుంచే..అఫీషియల్

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ తరఫున పోటీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 21 సీట్లలో కేవలం ఐదుగురు అభ్యర్థుల పేర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో, మిగతా 16 మంది అభ్యర్థులు ఎవరు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్న సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు, కాకినాడ ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పుకార్లకు చెక్ పెడుతూ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు గా పవన్ కళ్యాణ్ స్వయంగా సంచలన ప్రకటన చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన నేతలు, కార్యకర్తలతో జరుగుతున్న సమావేశంలో పవన్ ఈ విషయం వెల్లడించారు. ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని పవన్ క్లారిటీనిచ్చారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి రెండు చోట్ల పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న పిఠాపురంలో పవన్ పోటీకి దిగబోతున్నారు.

అయితే, పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో వైసీపీ పావులు కదుపుతోందని తెలుస్తోంది.

మరోవైపు, తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి ఈ రోజు జనసేనలో చేరారు. నరహరికి కండువా కప్పి పవన్ కళ్యాణ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు గంటా నరహరి బంధువు. 2017-18 లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారాన్ని నరహరి అందుకున్నారు. బెంగళూరు కేంద్రంగా ఆయన వ్యాపారాలు సాగిస్తుంటారు. నరహరి జనసేన తరఫున తిరుపతి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.