వెలుగులోకి ’నూతన్’ లీలలు… ఇంకా ఎన్నున్నాయో ?

శిరోముండనం ఘటనలో అరెస్టయిన నూతన్ నాయుడు లీలలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. తనింట్లో ఓ దళిత యువకుడు శ్రీకాంత్ కు శిరోముండనం చేయించిన ఘటన పెద్ద సంచలనమే సృష్టించింది.

ఈ ఘటనలో నాయుడు భార్యతో పాటు కుటుంబసభ్యులు, ఇంట్లో పనిచేసే ఉద్యోగులు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత నాయుడు పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వేస్టేషన్లు అరెస్టు చేశారు. ఎప్పుడైతే నాయుడును పోలీసులు అరెస్టు చేశారో ఆయన బాధితులు ఒక్కోళ్ళు వెలుగులోకి వస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ లో ఇద్దరు బాధితులు బయటకు వచ్చి నాయుడుపై కేసులు పెట్టారు. ఇద్దరి దగ్గర నుండి నాయుడు ఏకంగా రూ. 12 కోట్లు వసూలు చేశాడట. శ్రీకాంత్ రెడ్డికేమో ఎస్బీఐలో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు ఇప్పిస్తానని చెప్పి రూ. 12 కోట్లు తీసుకున్నాడట. అలాగే నూకరాజు అనే వ్యక్తి దగ్గర నుండి ఎస్బిఐలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5 లక్షలు తీసుకున్నాడట. వీళ్ళకన్నా ముందు మరికొందరు దగ్గర ఉద్యోగాలిప్పిస్తానని, బ్యాంకుల్లో లోన్లిప్పిస్తానని చెప్పి భారీగానే వసూళ్ళు చేసినట్లు బాధితుల కథనం ప్రకారం అర్ధమవుతోంది. అలాగే సాఫ్ట్ వేర్ కంపెనీ పెట్టి నిరుద్యోగుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చేసిన వసూళ్ళు అదనం.

మొత్తానికి అసలు నూతన్ నాయుడు ఏమి చేస్తున్నాడనే విషయంలో ఇప్పటికీ ఎవరికీ క్లారిటి లేదు. కొందరితో వ్యాపారాలు చేస్తున్నాడని చెప్పాడు. మరొకొందరితో సాఫ్ట్ వేర్ పరిశ్రమ ఉందని నమ్మబలికాడు. ఇదే సందర్భంలో టిడిపి+జనసేన పార్టీలో కీలకమైన వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా ప్రముఖుడిననే కలరింగ్ ఇచ్చుకున్నాడు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని జనాలు అనుకునేట్లుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై సెటైరికల్ సినిమా పరాన్నజీవి అనే సినిమా కూడా తీశాడు. చివరకు తేలిందేమంటే నాయుడు అత్యంత వివాదాస్పదమై వ్యక్తని. ఇప్పటికి నూతన్ నాయుడు లీలలు బయటకు వచ్చినవి కొన్ని మాత్రమే. భవిష్యత్తుల్లో ఇంకెన్ని కొత్తగా బయటపడతాయో చూడాల్సిందే.