పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తానని భావించిన 24 స్థానాలకు 21 స్థానాలకు కుదించుకోవటం తెలిసిందే. ఇందులో అధికారికంగా ఆరు స్థానాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ప్రకటించటం తెలిసిందే. బుధవారం రాత్రి వేళలో మరో తొమ్మిది మంది అభ్యర్థులకు పచ్చజెండా ఊపుతూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులను వ్యక్తిగతంగా పిలిపించుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. అభ్యర్థులుగా ఖరారు చేసిన వారితో ప్రత్యేకంగా మాట్లాడి.. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న విషయాన్ని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అభ్యర్థులుగా ప్రచారం చేసుకోవటానికి ఓకే చెప్పేశారు.
ఈ తొమ్మిది మందిలో..
- పంచకర్ల రమేశ్ (ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి)
- సుందరపు విజయ్ కుమార్ (ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలి)
- వంశీక్రిష్ణ యాదవ్ (విశాఖ దక్షిణం)
- బొలిశెట్టి శ్రీనివాస్ (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం)
- పత్సమట్ల ధర్మరాజు (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు)
- బొమ్మిడి నాయకర్ (నరసాపురం)
- పులపర్తి రామాంజనేయులు (భీమవరం)
- దేవ వరప్రసాద్ (ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు)
- ఆరణి శ్రీనివాసులు (తిరుపతి)
తొలి జాబితాలో ఆరుగురు అభ్యర్థుల్ని ప్రకటించగా.. తాజాగా అభ్యర్థులుగా ఫైనల్ చేసిన వారితో స్వయంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. వారిని ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీ చేసే మిగిలిన ఆరు స్థానాలేమిటి? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జనసేన పోటీ చేసే మిగిలిన ఆరు నియోజకవర్గాల మీద దాదాపుగా క్లారిటీ వచ్చినట్లేనని చెబుతున్నారు.
కాకినాడ జిల్లాలోని పిఠాపురం
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం
కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం
విజయనగరం జిల్లాలోని పాలకొండ
కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ
అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు లేదంటే ఏలూరు జిల్లాలోని పోలవరంలో ఏదో ఒక స్థానం నుంచి జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతారని చెబుతున్నారు.
పొత్తులో భాగంగా ప్రకటించాల్సిన ఆరు స్థానాల్లో అభ్యర్థుల విషయానికి వస్తే.. ఒక్కోచోట ఇద్దరు ముగ్గురు చొప్పున టికెట్ ను ఆశిస్తున్నారు. వీరిలో అంతిమంగా టికెట్ ఎవరికి దక్కుతుందన్నదిఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం ఆరు స్థానాల్లో పాలకొండ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. 21 జల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి.. ఈ స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.