విడివాడ‌, ప‌ద్మ‌నాభం.. YCPకి ప్ల‌స్ అవుతారా?

కాపుల‌ను ఏకం చేయ‌డం.. వారి ఓటు బ్యాంకు బ‌ద్నాం కాకుండా త‌న‌కు అనుకూలంగా మార్చు కోవ‌డం వంటి కీలక వ్యూహాల దిశ‌గా ప‌వ‌న్ అడుగులు వేస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే కాపు ఉద్య‌మ నాయ‌కుడు.. కేంద్ర‌ మాజీ మంత్రి ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఈ నెల 14న వైసీపీలో చేరనున్న విష‌యం తెలిసిందే. ఎలాంటి ష‌ర‌తులు లేకుండా ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌ల‌కు, త‌న అబిమానుల‌కు లేఖ రాశారు. తాను వైసీపీలో చేరుతున్న‌ట్టు తెలిపారు.

ఈ నెల 14న సీఎం జ‌గ‌న్ పిలుపు మేరకు తాను వైసీపీ తీర్థం పుచ్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. తాను 14వ తేదీన కిర్లంపూడిలోని త‌న నివాసం నుంచి బ‌య‌లు దేరి సీఎంజ‌గ‌న్ స‌మక్షంలో పార్టీలో చేరుతున్న‌ట్టు పేర్కొన్నారు. అయితే..తాను ఎలాంటి త‌ప్పుడు ప‌నిచేయ‌లేద‌ని.. చేయ‌బోన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. త‌న‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌ని.. మీ బిడ్డ‌గా తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించాల‌ని కోరారు. అయితే.. ఆయ‌న వెంట ఎంత మంది కాపులు ప్ర‌యాణిస్తార‌నేది చూడాలి.

మ‌రో కీల‌క నేత విడివాడ రామ‌చంద్ర‌రావుకు త‌ణుకు టికెట్ ఇస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆయ‌న‌తో బాగానే ఖ‌ర్చు పెట్టించార‌నే చ‌ర్చ సాగుతోంది. అయితే..ఈ టికెట్ కూడా ద‌క్క‌లేదు. పోనీ..ప‌వ‌న్ . ఇలాంటి కీల‌క నేత‌ల‌ను పిలిచి మాట్లాడింది కూడా లేదు. ఫ‌లితంగా విడివాడ కొంత సంయమ‌నం పాటించినా.. కాపుల నుంచి వ‌స్తున్న వ‌త్తిళ్లు.. భ‌విష్య‌త్ రాజ‌కీయంపై గంద‌ర‌గోళం నెల‌కొన్న నేపథ్యంలో జ‌న‌సేన‌లో ఉండ‌లేన‌ని తాజాగా నిర్ణ‌యించుకున్నారు.

తాజాగా అనుచరుల స‌మావేశంలో ఆయ‌న వైఎస్సార్ సీపీలో చేరేందుకు దాదాపు ఒక క్లారిటీకి వ‌చ్చార‌ని తెలిసింది. మొత్తంగా చూస్తే.. తూర్పు గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయాలు మారుతున్న నేప‌థ్యంలో ఇది ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నీయ‌బోమ‌న్న జ‌న‌సేనకు మైన‌స్ అవుతుండ‌గా, అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి ప్ల‌స్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.