స్మిత స‌భ‌ర్వాల్ ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు

వివాదాల‌కు కేంద్రంగా మారిన మ‌హిళా ఐఏఎస్ స్మితా స‌భ‌ర్వాల్‌.. తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్నార ని అంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు. గిరిజ‌న శాఖ మంత్రి సీత‌క్క ముందు ఓ ఐఏఎస్ అధికారిగా కాలిపై కాలేసుకుని కూర్చున్న వ్య‌వ‌హారం రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. వాస్త‌వానికి మంత్రుల ముందు అధికారులు కూర్చుకునేందుకు కొన్ని ప్రొటోకాల్ నిబంధ‌న‌లు ఉన్నాయి. వాటిని త‌ప్ప‌నిస‌రిగా పాటించా లి. ఒక్క మంత్రి ముందు మాత్ర‌మే కాదు.. త‌న ఉన్నతాధికారి ముందు కూడా.. జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రూల్స్ బుక్ చెబుతోంది.

కానీ, ఏ మాత్రం ప్రొటోకాల్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా.. పైగా కాలిపై కాలేసుకున్న స్మిత స‌భ‌ర్వాల్.. గ‌డుసు స‌మాధానం చెప్ప‌డం వివాదాన్ని మ‌రింత రెచ్చ‌గొట్టేలా చేశారు. మంత్రి ముందు ఎలా కూర్చోవాలో రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఎలా కూర్చుంటే.. ఎవ‌రికి కావాలి? నేను ఎలా ఉన్నా.. అది నాకు సౌక‌ర్యంగా ఉంటే చాలు.. అని వ్యాఖ్యానించారు.

తన వయసు ఇప్పుడు 47 సంవత్సరాలని, ఈ వయసులో ఎలా కూర్చోవాలో, ఎలా నిల్చోవాలో ఒకరు చెప్పాల్సిన పనిలేదని అన్నారు. నిజానికి అందులో ఎలాంటి వివాదమూ లేదని, ఎవరో ఫొటోగ్రాఫర్ దానిని క్లిక్ మనిపిస్తే మరెవరో దానిని ట్రోల్ చేశారని, ఒకరకంగా ఈ వివాదానికి మీడియానే కారణమని గ‌డుసుగా వ్యాఖ్యానించారు.

ఏం జ‌రిగిందంటే..

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక మంత్రి సీతక్కతో స్మితా సభర్వాల్ తొలిసారి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎదురుగా ఆమె కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఓ ఆదివాసీ నాయకురాలితో ప్రవర్తించేది ఇలాగేనా? అంటూ మండిపడ్డారు. ఇది అహంకారం తప్ప మరోటి కాదని నెటిజ‌న్లు దుయ్యబట్టారు.దీనిపై స్మిత ఓ మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా గ‌డుసు స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం.