రాబోయే ఎన్నికల్లో అత్యధిక సీట్లలో పార్టీ గెలుపుపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాను పోటీచేయబోతున్న సీట్లలో మ్యాగ్జిమమ్ గెలుచుకోవటంతో పాటు మిత్రపక్షాల పార్టీల అభ్యర్ధులను గెలిపిచుకునేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నరేంద్రమోడి వారంలో రెండుసార్లు ఏపీలో పర్యటించబోతున్నారు. ఈనెల 17వ తేదీన చిలకలూరిపేటలో కూటమి ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి బహిరంగసభకు నరేంద్రమోడి హాజరవుతున్నారు. అలాగే 15వ తేదీన విశాఖపట్నంలో జరగబోయే రోడ్డుషోలో పాల్గొనే అవకాశముందని పార్టీవర్గాల సమాచారం.
ముందుగా విశాఖలో బహిరంగసభ అనుకున్నా తర్వాత ఎందుకో రోడ్డుషోగా మార్చారు. మోడీ పర్యటన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు చాలామంది కేంద్ర మంత్రులు, పార్టీలోని ముఖ్యనేతలు ఏపీలో పర్యటించబోతున్నారు. గతంలో మోడీతో పాటు ఇంతమంది ఏపీపైన ఎప్పుడూ ప్రత్యేక దృష్టిపెట్టిందిలేదు. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే బీజేపీ పోటీచేయబోయే పది నియోజకవర్గాలు కూడా డిసైడ్ అయిపోయాయట. విశాఖ ఉత్తరం నియోజకవర్గం, పాడేరు, శ్రీకాకుళం, అనపర్తి, పీ గన్నవరం, కైకలూరు, గుంటూరు వెస్ట్, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, మదనపల్లి, రాజంపేట నియోజకవర్గాల్లో ఏవైనా పదిచోట్ల పోటీచేస్తుందట.
అందుకనే ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్ గా బీజేపీ చూస్తోందట. కాబట్టి ప్రతి యూనిట్ కు కొందరు కేంద్రమంత్రులు, పార్టీలోని ముఖ్యనేతలను కేటాయించబోతోందని సమాచారం. ఈ యూనిట్లలో పార్టీ పరిస్ధితిపై ప్రతిరోజు నివేదికలు తెప్పించుకునేందుకు గ్రౌండ్ లెవల్లో పరిశీలకులను నియమించబోతున్నారు. వీళ్ళిచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిని ఏరోజుకారోజు పార్టీ పెద్దలు అంచనా వేస్తారు. ఇందుకోసం ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక సెల్ ను ఏర్పాటుచేయబోతున్నారు.
ఢిల్లీలోని ఈ ప్రత్యేక సెల్ విజయవాడలోని పార్టీ ఆఫీసుతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. దీనికోసం పార్టీ నేతలను ప్రత్యేకంగా నియమించారు. వీలైనన్ని బహిరంగసభలు, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ, జనసేన కూటమితో జట్టుకట్టిన కారణంగా పోటీచేయబోయే ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపుపైన ఎక్కువగా దృష్టిపెట్టింది. మరి ఆచరణకు వచ్చేసరికి ఏమవుతుందో చూడాల్సిందే.