ఆ ఇద్ద‌రు ఔట్‌.. ఏపీలో కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజ‌కీయాలు వేడి వేడిగా మారుతున్నాయి. ప్రత్యర్థుల ను చిత్తు చేసే ఉద్దేశంలో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.  అధికార పార్టీ ఆ దిశగా మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవ‌ల రెబ‌ల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్‌ ఇప్పుడు ఎమ్మెల్సీలపై మండ‌లి చైర్మ‌న్ వేటు వేశారు. వైసీపీ తరఫున ఎన్నికైన వారు..  వేరే పార్టీల్లో చేరిన నేప‌థ్యంలో వారిపై మండ‌లి చ‌ర్య‌లు తీసుకుంది.  

వైసీపీ ఎమ్మెల్సీలు సీ. రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌ ఇద్దరూ కూడా జ‌న‌వ‌రి వ‌ర‌కు వైసీపీలో ఉన్నారు. అక్కడే ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించడంతోపాటు ఇతర కారణాలతో ఇద్దరూ జగన్‌తో విభేదించి బయటకు వచ్చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య వైసీపీలో ఉంటూ ఈ మధ్య కాలంలో టీడీపీలోకి వచ్చారు. వైసీపీలో తనలాంటి వారికి గౌరవం లేదని ఆరోపించారు. అందుకే అక్కడ ఇమడలేక టీడీపీలోచేరినట్టు పేర్కొన్నారు.

వంశీ కృష్ణ విశాఖ వేదికగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ వచ్చే ఎన్నికల్లో సీటు ఆశించారు. సీటు ఇవ్వడం ఇచ్చేది లేదని జగన్ చెప్పేయడంతో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. జనసేనలో చేరి పవన్‌ నుంచి టికెట్ హామీ పొందారని అంటున్నారు. దీంతో ఆయనపై మండలి కార్యదర్శికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఇద్ద‌రు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని  వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది.  

ఈ ఫిర్యాదుపై విచారణ చేసిన మండలి ఛైర్మన్‌  మోషేన్‌ రాజు ప‌లు ద‌ఫాలుగా నోటీసులు పంపించారు.   వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించారు. ఛైర్మన్‌ ఇచ్చిన నోటీసులపై స్పందించిన వంశీకృష్ణ, రామచంద్రయ్య వివరణ కూడా ఇచ్చారు. వాళ్ల వివరణ సంతృప్తి కరంగా లేదని అందుకే చర్యలు తీసుకుంటున్నట్టు మండలి ఛైర్మన్‌ వివరించారు. ఈ క్ర‌మంలో వారి మండ‌లి స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.