వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా పిలవబడుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం.! వైసీపీ నేత, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, తనను తాను ‘లెస్ కరప్టడ్’గా అభివర్ణించుకోవడమే ఆ తీవ్ర కలకలానికి కారణం.! అయినా, ఆయన ఏమన్నాడనీ, ‘లెస్ కరప్టడ్’ అని మాత్రమే కదా.? రూపాయి దొంగతనం జరిగినా, దాన్ని దొంగతనం అనే అంటారు.! లక్ష కోట్ల దొంగతనాన్నీ దొంగతనమే అంటారు.! రెండిటికీ పెద్ద తేడా ఏమీ వుండదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ మహిళా జర్నలిస్టు సాక్షిగా మంత్రి అంబటి రాంబాబు తనను తాను ‘లెస్ కరప్టడ్’గా అభివర్ణించుకోవడం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతోంది. ‘వైసీపీలో నాకన్నా తీవ్రమైన కరప్టడ్ వ్యక్తులు వున్నారు’ అనే దిశగా అంబటి రాంబాబు పెద్ద బాంబే పేల్చారంటూ కొందరు కొత్త కొత్త అర్థాలు తీస్తున్నారు.
రాజకీయాల్లో మాటల్ని చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. వాస్తవానికి, అంబటి రాంబాబు ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తపరుడనే అనుకోవాలి. ‘మనవి చేసుకుంటున్నాను’ అనే మాట ఆయన నోటి నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారాయన.
పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడమంటే, కొత్తగా మంత్రినైన తనకు కొన్ని విషయాలపై అవగాహన వుండకపోవచ్చనీ, వాటి గురించి తెలుసుకుంటాననీ చెప్పడం అప్పట్లో సంచలనమైంది. దానిపై ఇప్పటికీ ఆయన్ని ట్రోల్ చేస్తుంటారు. అంత ట్రోలింగ్ అప్పట్లో ఎదుర్కొన్న అంబటి రాంబాబు, ‘లెస్ కరప్టడ్’ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు.?
తమది కరప్షన్ లెస్ ప్రభుత్వమని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేదికలెక్కి ప్రసంగాలు దంచేస్తోంటే, మంత్రి అంబటి రాంబాబు మాత్రం తాను లెస్ కరప్టడ్ అనడం.. వైసీపీ ప్రభుత్వానికీ ఇబ్బందికరమే. వైసీపీకి ఇంకా ఇంకా ఇబ్బందికరం. ఒకటికి నాలుగుసార్లు లెస్ కరప్టడ్ అన్నమాటని పునరుద్ఘాటించారు అంబటి రాంబాబు. వైసీపీ అనుకూల మీడియాకి చెందిన జర్నలిస్టు కావడంతో, మంత్రి అంబటి రాంబాబుని ఆమె వారించే ప్రయత్నం చేసినా, ఆయన తగ్గలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates