జ‌గ‌న్ స‌భ‌కు మీరు రావొద్దు: మీడియాకు నోటీసులు

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాల‌కు సంబంధించిన స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. సిద్ధం పేరుతో ఇప్ప‌టికే విశాఖ‌, ఏలూరు, అనంత‌పురంలో మూడు స‌భ‌లు నిర్వ‌హించారు. తాజాగా బాప‌ట్ల జిల్లాలో ఆయ‌న స‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈ ‘సిద్ధం’ సభ కవరేజీకి రావొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఎవ‌రైనా మీడియాను ర‌మ్మ‌ని కోరుకుంటారు. అంతేకాదు.. మీడియా ప్ర‌తినిధులు వ‌చ్చే వ‌ర‌కు కూడా కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌ని నాయ‌కులు కూడా ఉన్నారు.

కానీ, చిత్రంగా జ‌గ‌న్‌స‌భ‌కు మాత్రం మీడియాను వ‌ద్ద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వీరికి నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. నోటీసులు తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు పోలీసులు ఫోన్లు చేసి మ‌రీ పిలిచిఇవ్వ‌డం విశేషం. సెక్ష‌న్ 149 కింద‌ నోటీసులు వచ్చాయని పోలీసులు తెలిపారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్‌ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు.

కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాలోని సభను అడ్డుకుంటారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తూర్పుపాలెం రైతులకు సైతం నోటీసులు ఇచ్చారు. సిద్ధం సభ వైపు వెళ్లొద్దంటూ నలుగురు రైతులకు పోలీసుల నోటీసులను జారీ చేశారు.

ఇదే కార‌ణ‌మా?

గ‌త నెల‌లో అనంత‌పురంలో నిర్వ‌హించిన సిద్ధం 3వ స‌భ‌లో ఓ మీడియా ఫొటో గ్రాఫ‌ర్‌పై వైసీపీ కార్య‌క‌ర్త లు దాడి చేశారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఫొటో గ్రాఫ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది రాజ‌కీయ దుమారానికి కూడా దారి తీసింది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు సిద్ధం 4వ స‌భ‌కు మీడియాను నియంత్రించి ఉంటార‌ని చెబుతున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రి లోగుట్టు ఏంట‌నేది వేచి చూడాలి.