కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 14న ఆయన వైసీపీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ బలోపేతానికి తాను కృషి చేస్తానని ముద్రగడ చెప్పారు. “వచ్చే ఎన్నికల్లో వైసీపీ బలోపేతానని, జగన్‌ను సీఎం చేసేందుకు నేను కృషిచేస్తా. ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నా” అని ముద్రగడ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలంతా జగన్‌వైపు ఉన్నట్టే తాను భావిస్తున్నానని.. ఆయనను ఓడించేందుకు ఇంత మంది కలిసిపోవడం.. దీనికి బలాన్ని చేకూరుస్తోంద న్నారు.
అయితే..వచ్చేఎన్నికల్లో తాను పోటీ చేయాలా వద్దా? అనే విషయాన్ని మాత్రం తాను ఇంకా నిర్ణయించుకోలే దన్నారు. పోటీలో ఉన్నా.. లేకున్నా.. తాను పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. వైసీపీ తరఫున గ్రామ గ్రామానా తిరుగుతానని.. ప్రచారం చేస్తానని అన్నారు. వైసీపీ తరఫున ఎలాంటి హామీ తనకు ఇవ్వలేదని ఆయన చెప్పారు. డబ్బుల కోసమో.. పదవులు ఆశించో తాను వైసీపీలో చేరడం లేదని.. కాపులకు న్యాయం జరగాలన్న ఏకైక ఉద్దేశంతోనే తాను వైసీపీ బాటపడుతున్నానని ముద్రగడ చెప్పారు.
కాగా.. ముద్రగడ వాస్తవానికి బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నారు. ఆ పార్టీ తరఫున కాకినాడ నుంచి పోటీ చేసి.. పార్లమెంటుకు వెళ్లి.. అక్కడ కాపు రిజర్వేషన్ విషయాన్ని తేల్చుకుందామని భావించారు. అయితే.. బీజేపీ టీడీపీలు కలిసి పోవడంతో ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన వైసీపీ కి కూడా చెప్పారు. బీజేపీతో చేతులు కలపాలని ఉందని.. అయితే ఆపార్టీ ఒంటరిగా పోటీ చేస్తే.. చేరతానని.. లేకపోతే, మీకే జై కొడతానని ఆయన అన్నారు. తాజాగా బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ముద్రగడ వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 14న ఆయన కండువా కప్పుకోనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates