అంతా ఆస్థాన విద్వాంసులే.. బీజేపీలో కొత్త ముఖాలేవీ?

యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని, కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తున్నామ‌ని చెప్పుకొనే బీజేపీ .. మ‌రోసారి కూడా ఆస్థాన విద్యాంసుల‌కే ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఏపీ వంటి భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహ‌త్మ‌కంగా ముందుకు సాగుతుంద‌ని ఆది నుంచి క‌మ‌ల నాథులు చెబుతు వ‌చ్చారు. కానీ, ఆ వ్యూహం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. పాత నాయ‌కులు, నిల‌య విద్యాంసుల‌కే ప‌ట్టం క‌డుతున్నారు.

టీడీపీ, జ‌న‌సేన పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయినట్లు స‌మాచారం. వీటిలో అరకు(ఎస్టీ), అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను బీజేపీకి కేటాయించినట్లు తెలిసింది. అయితే.. వీటి నుంచిపోటీ చేసేవారిలో ఏ ఒక్క‌రూ కొత్త‌వారు లేక‌పోగా.. అంద‌రూ ఓట‌మి వీరులుగా పేరు తెచ్చుకున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

అరకు స్థానం నుంచి కొత్తప‌ల్లి గీత పోటీలో ఉన్నార‌ని స‌మాచారం. ఈమె 2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయి.. కేసుల్లో ఇరుక్కుని.. త‌ర్వాత బీజేపీ పంచ‌న చేరారు. ఈమెకు ఇక్క‌డ ఓటు బ్యాంకు ఏమీ పెద్ద‌గా లేదు.

ఇక‌, ప్ర‌తి ఎన్నిక‌ల‌కు సీటు మార్చుకునే బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి ఈ సారి రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ, ఇక్క‌డ ఆమె గెలుపు అంత ఈజీకాదు. బ‌ల‌మైన టీడీపీ నేత‌లు స‌హ‌క‌రించాల్సి ఉంటుంది. ఇది ప్ర‌శ్నార్థ‌క‌మే. కడప జిల్లా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయ‌నున్నట్టు స‌మాచారం. ఈయ‌న కూడా దాపు 10 సంవ‌త్స‌రాలుగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. దీంతో గెలుపు చాలా క‌ష్ట‌మ‌ని అంటున్నారు. హిందూపూరం నుంచి – సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపన్‌ చౌదరి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరి గెలుపు కూడా అంత ఈజీ కాదు.