బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తులు ఖరారైన నేపథ్యంలో ఎన్నికల ప్రచార సభలపై వెంటనే దృష్టి పెట్టారు. ప్రధానంగా నరేంద్ర మోడీని ఏపీకి తీసుకురావడం ద్వారా.. ప్రజలను పొత్తుల పార్టీవైపునడిపించేందుకు అవకాశం ఉంటుందనే అంచనాలు వేసుకున్నారు. ఈ క్రమంలో మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీనే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
పైగా రాజధాని అమరావతిని ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా మార్చాలని భావిస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంంలోనే ఈ ఉమ్మడి తొలి సభను ఏర్పాటు చేయాలని టీడీపీ యోచిస్తోంది. ఈ క్రమంలో మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిలకలూరిపేట, పల్నాడులోని గురజాల, నరసారావుపేటలలో ఏదో ఒక వేదికగా ఉమ్మడి పార్టీల తొలి భారీ బహిరంగ సభ జరగనుందన సమాచారం. ఈ సభను చంద్రబాబు, పవన్ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ సభకు రావాలని మోడీని ఆదివారం ఆహ్వానించనున్నారు.
ఈ మేరకు బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాకు చంద్రబాబు, పవన్ విజ్ఞప్తి చేశారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ 17న ప్రధానికి వీలుకాకుంటే మరోరోజు 18న లేదా 19న సభకు సర్వం సిద్ధం చేస్తామని నడ్డాకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదిలావుంటే, ప్రధాని ఏపీకి వస్తే.. ఎలాంటి హామీలు ఇస్తారు? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా.. మరో కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు.. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏమేం మాట్లాడుతారో అనేదానిపై కూడా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సర్వత్రా చర్చ సాగుతోంది. సభకు మోడీ వచ్చే లోపే.. సీట్ల లెక్కలు, ఇంకా ఉమ్మడి కార్యాచరణ లాంటివి దాదాపు కొలిక్కి వచ్చేస్తాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బీజేపీతో పొత్తు అని టీడీపీ చెబుతుండగా.. బీజేపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని కమలనాథులు చెబుతున్నారు. పొత్తు ఆవశ్యకతను ప్రజలకు వివరించే బాధ్యతను పార్టీ ముఖ్యనేతలకు చంద్రబాబు అప్పగించారు.