ఏపీలో టీడీపీ-జనసేన మిత్రపక్షంతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమయ్యామని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాయింట్ ప్రెస్ స్టేట్ మెంట్ రూపంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్న ప్రధాని మోడీ నేతృత్వంలో కలిసి పని చేందుకు టీడీపీ, జనసేన ముందుకు వచ్చాయని నడ్డా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా మోడీతో కలిసి టీడీపీ, జనసేన కృషి చేస్తాయన్నారు.
టీడీపీ , బీజేపీ మధ్య గతంలోనూ మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరిందన్నరు. వాజ్ పేయి.. నరేంద్రమోడీ నాయకత్వాల్లోని ప్రభుత్వాల్లో టీడీపీ భాగమయిందన్నారు. 2014లో టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు తెలిపిందన్నారు. వచ్చే ఎన్నికలకు సంబందించి ఒకటి రెండు రోజుల్లో సీట్ల పంపకాల వ్యవహారం కూడా పూర్తవుతుందన్నారు.
ఎన్నెన్ని?
పొత్తు ఖరారైనా.. సీట్ల పంపకాలపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే, ఢిల్లీ వర్గాల కథనం మేరకు జనసేన, బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లను చంద్రబాబు కేటాయించారని చెబుతున్నారు. ఇందులో ఆరు బీజేపీ పోటీ చేస్తుంది. రెండింటిలో జనసేన పోటీ చేయనుందని సమాచారం. జనసేన రెండు స్థానాలు కాకినాడ, మచిలీపట్నంగా ఖరారయ్యాయని అంటున్నారు. అనకాపల్లి కూడా జనసేనకే రావాల్సి ఉన్నా.. బీజేపీ ఒత్తిడితో ఆ పార్టీకి కేటాయించారని ఢిల్లీ వర్గాల కథనం.
రాజంపేట, ఏలూరు, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, హిందూపురం నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనుంది. మిగిలిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటారు. ఇక అసెంబ్లీ స్థానాల్లోనూ లెక్క కుదిరిందని తెలిసింది. బీజేపీ, జనసేనకు కలిసి 30 నియోజకవర్గాలు కేటాయించారు. ఇందులో 24 జనసేన, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆ ఆరు నియోజకవర్గాలు ఎక్కడివనే విషయంపై రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలతో టీడీపీ, జనసేన నేతలు చర్చించి ఖరారు చేసుకుంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates