బీజేపీతో పొత్తుల వ్యవహారంపై తుది చర్చలు జరిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5.30 వరకు దాదాపు 2 గంటల పాటు గురు శిష్యులిద్దరూ కీలకమైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంతో పాటు ఏపీ రాజకీయాలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాత్ర ఏ విధంగా ఉండాలి అన్న వ్యవహారంపై కూడా చంద్రబాబు, రేవంత్ చర్చించినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్…అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా 2024 ఎన్నికలలో టీడీపీ-జనసేన కూటమికి రేవంత్ రెడ్డి కూడా మద్దతు ఏ విధంగా తెలపాలి అన్న వ్యవహారంపై ఈ ఇద్దరు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఇక లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించేందుకు బిజెపితో కాంగ్రెస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోడీని పెద్దన్న అంటూ రేవంత్ రెడ్డి సంబోధించారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీతో బీజేపీ పొత్తు చర్చలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు, రేవంత్ భేటీ అయ్యారన్న టాక్ వస్తోంది.
ఓ పక్క టీడీపీ-జనసేన-బిజెపి కూటమి దాదాపు ఖరారు కాబోతున్న నేపథ్యంలో వైసీపీ పై ముప్పేట దాడి ఖాయమని ఇద్దరు చర్చించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ కూడా వైసీపీపై విరుచుకుపడుతోందని, ఏపీ కాంగ్రెస్ కు తెలంగాణ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. జగన్ పై నలువైపుల నుంచి దాడి చేసే అవకాశం ఉంటుందని వారు మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. మరో ఐదు రోజుల్లో ఏపీలో ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పార్టీకి కావాల్సిన సహాయ సహకారాలపై కూడా ఈ ఇద్దరు నేతలు చర్చించారని తెలుస్తోంది.