‘అంతర్వేది’ తో బీజేపీ – వైసీపీ మధ్య గ్యాప్ పెరిగిందా?

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం రాజకీయ దుమారం రేపింది. దీంతో, వైసీపీ సర్కార్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏపీలో జరుగుతున్నాయో లేదో ప్రభుత్వమే తేల్చుకోవాలని, ఎవరు రెచ్చగొడుతున్నారో తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతర్వేదిలో అరెస్ట్ చేసిన వారిని, గృహనిర్బంధంలో ఉంచిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.

వైసీపీ హయాంలో హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. దేవాలయాలకు సంబంధించిన రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం నూతన విధానాన్ని పాటించాలని బీజేపీ రాష్ట్రా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

ఈ నేపథ్యంలో అంతర్వేది ఘటన వైసీపీ, బీజేపీల మధ్య గ్యాప్ పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కారుపై బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు విమర్శలు గుప్పించడం విశేషం. ఇటీవల కాలంలో పాలనా విషయాల్లో వైసీపీతో బీజేపీకి కొంత గ్యాప్ ఉందని టాక్ వచ్చింది. అయితే,కేంద్రంలో ఎన్డీఏతో వైసీపీకి ఉన్న సఖ్యత రీత్యా ఒకటి అర సందర్భాల్లో తప్ప…బీజేపీ పెద్దగా వైసీపీని టార్గెట్ చేయలేదు. అయితే, హిందుత్వ ఎజెండానే బలంగా భావిస్తోన్న బీజేపీ…రథం దగ్ధం విషయంలో వైసీపీపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో వైసీపీ, బీజేపీల మధ్య బాగా గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. హిందువుల సెంటిమెంట్ దెబ్బతినడంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఈ ఘటనపై సీరియస్ గా ఉన్నారట. ఎప్పటి నుంచో ఏపీతోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీకి ఈ ఘటన పూర్తిగా కలిసివచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పై, వైసీపీ సర్కార్ పై ఏపీ బీజేపీ నేతల వైఖరి ఏ విధ:గా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.