ఇంట్లో మాట్లాడి చెబుతానన్న ముద్ర‌గ‌డ

రాజ‌కీయ అరంగేట్రంపై సుదీర్ఘ చ‌ర్చ‌లు.. వాదోప‌వాదాలు.. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే తాను ఏపీ అధికార పార్టీ వైసీపీలో చేర‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. అయితే.. మంచిరోజు చూసుకుని చేర‌తాన‌ని. దీనికి ముందు మీడియాకు తాను స‌మాచారం ఇస్తాన‌ని ముద్ర‌గడ పేర్కొన్నారు.దీంతో ముద్ర‌గ‌డ కుటుంబం రాజ‌కీయ ప్ర‌స్తానం తిరిగి ప్రారంభ‌మైన‌ట్ట‌యింది.

ఇదిలావుంటే.. గ‌త రెండు రోజులుగా తీవ్ర నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. బుధ‌వారం ఉద‌యం నుంచి కూడా ముద్ర‌గ‌డ ఇంటికి వైసీపీ నాయ‌కులు ప‌లువురు క్యూ క‌ట్టారు. తొలుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి.. త‌ర్వాత మాజీ మంత్రి క‌న్న‌బాబు వంటివారు కూడా ముద్ర‌గ‌డ‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇలా .. బుధ‌వారం అంతా చ‌ర్చ‌ల వ్యవ‌హారం సాగింది. అనంత‌రం.. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త ఎంపీ మిథున్‌రెడ్డి రంగంలోకి దిగారు.

దీంతో క‌థ సుఖాంత‌మైంది. గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కే ముద్ర‌గ‌డ ఇంటికి వ‌చ్చిన వైసీపీ కీల‌క నాయ కులు.. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు మ‌రింత ముందుకు తీసుకువెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న కుమారుడికి టికెట్‌ను ఆశిస్తుండ‌గా.. ఈ ద‌ఫా ముద్ర‌గ‌డ‌నే బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్టు వైసీపీ నాయ‌కులు చెప్పా రు. దీనిపై ఇంట్లో మాట్లాడి చెబుతాన‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు.

పార్టీలో చేర‌డానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. అయితే.. కాపు స‌మ‌స్య‌ల‌పైనే త‌న డిమాండ్లు ఉన్నాయ‌ని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు. దీనికి స్ప‌ష్టత ల‌భించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌న చేరిక ఖాయ‌మైంది. ఇదే విష‌యాన్ని ముద్ర‌గ‌డ కూడా అధికారికంగా వెల్ల‌డించారు. అయితే.. మంచి రోజు పార్టీలోచేర‌తాన‌ని చెప్పారు.