జ‌న‌సేన‌లోకి వాసిరెడ్డి.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

వైసీపీలో సంచ‌ల‌నం చోటు చేసుకోనుందా? కీల‌క నాయ‌కురాలు.. ప్ర‌స్తుత మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌.. జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అయ్యారా? ఇప్ప‌టికే ర‌హ‌స్యంగా మంత‌నాలు కూడా పూర్తి చేసుకున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు పంపించారు. అయితే.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

వాసిరెడ్డి ప‌ద్మ‌.. వైసీపీ నాయ‌కురాలిగా దాదాపు 10 ఏళ్లుగా ఆమె ప‌నిచేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు కూడా ఆమె ప్ర‌య‌త్నాలు చేశారు. గతంలోప్ర‌జారాజ్యంపార్టీలో ప‌నిచేసిన ఈమె కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. ఎస్సీ వ్య‌క్తిని వివాహం చేసుకున్నారు. 2009లో జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క వర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. త‌ర్వాత‌.. వైసీపీ బాట ప‌ట్టారు. సుదీ ర్ఘకాలంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సీఎం జ‌గ‌న్ ఆమెకు మ‌హిళ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రెండోసారి కూడా రెన్యువ‌ల్ చేశారు. త‌ర‌చుగా ఆమె ప్ర‌భుత్వం ప‌క్ష‌మే మాట్లాడుతున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయాల‌ని భావించారు. కానీ, టికెట్ విష‌యంలో ఎటూ తేల‌క పోవ‌డం.. కాపుల ప్ర‌భావం ఇప్పుడు జ‌న‌సేన‌వైపు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆమె జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది. గ‌తంలో చిరంజీవితో ఉన్న ప‌రిచ‌యాలు.. పార్టీలో ప‌నిచేసిన అనుభ‌వం నేప‌థ్యంలో ప‌వ‌న్ కూడా ఆమెను ఆహ్వానించిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.