ఏపీ రాజధానులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార వికేంద్రీకరణ.. అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ చేసేందుకు వీలుగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విపక్షం తీవ్రంగా తప్పు పడుతోంది. ఇలాంటివేళ..మేధావి వర్గానికి చెందిన లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఒక టీవీ చానల్ లో జరిగే చర్చకు హాజరైన ఆయన.. ఏపీ రాష్ట్రం పేరు నేరుగా ప్రస్తావించకుండా.. మూడు రాజధానుల అంశాల్ని ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేమన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలనేది నిర్ణయించే స్వేచ్ఛ ఉంటుందన్న ఆయన.. మంచి చెడులను పక్కన పెట్టేయాలన్నారు.
ఇష్టం ఉన్నా లేకున్నా ఒకసారి ఓటువేసి ఎన్నుకున్న ప్రభుత్వం చట్టబద్ధమైన నిర్నయం తీసుకుంటే నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. అదే సమయంలో మీరు ఇలా చేయకూడదనే మాట చెప్పటానికి కోర్టులకు కానీ మరొకరికి కానీ ఉండదన్నారు.
ప్రభుత్వాలు.. కోర్టులు.. చట్టసభలు తమ తమ పాత్రలు పోషించాలని.. దేశంలో పలు సందర్భాల్లో కలగాపులగం అయిపోతుందన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రభుత్వంలా.. మరికొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు కోర్టుల్లా వ్యవహరిస్తుంటాయన్నారు. మూడు ప్రాంతాల్లో మూడురాజధానులపై ఏర్పాటు అంశాన్ని జేపీ సమర్థించటం చూస్తే.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయం కలుగక మానదు.