దేశంలోనే తొలిసారి నిర్మించిన అండరవాటర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశ్చిమ బంగాల్‌లోని కోల్‌కతాలో నిర్మించిన తొలి అండర్‌వాటర్ మెట్రో టన్నెల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కాగా.. ఇది దేశంలోనే మొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు కావడం విశేషం. కోల్‌కతా తూర్పు, పశ్చిమ మెట్రో కారిడార్‌లో భాగంగా హుగ్లీ నది దిగువన మొత్తం 16.6 కిలో మీటర్ల మేర ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు.
ఈ అండర్వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని హౌరా మైదాన్ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్ మధ్యలో ఏర్పాటు చేశారు. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ టన్నెల్ను 45 సెకన్లలో దాటే మెట్రో రైలు కోలకతాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త సరికొత్త అనుభూతిని అందించనుంది. గ్రౌండ్ లెవెల్‌కి 30 మీటర్ల లోతులో ఈ కారిడార్‌ని నిర్మించారు.
ఏప్రిల్ 2023లో, కోల్‌కతా మెట్రో ట్రయల్స్‌లో భాగంగా హుగ్లీ నది కింద సొరంగం గుండా రైలును నడిపారు. ఈ రైలు మొత్తం 4.8 కిలోమీటర్ల పొడవున ఉన్న హౌరా మైదాన్‌ను ఎస్ప్లానేడ్‌కు కలుపుతుంది. ఇది తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్‌లో భాగం. హౌరా మైదాన్‌ను ఐటీ హబ్ సాల్ట్ లేక్ సెక్టార్ Vతో కలుపుతుంది. కేవలం 45 సెకన్లలో హుగ్లీ నది కింద 520 మీటర్ల మేర మెట్రో ప్రయాణించనుంది.
ఎస్ప్లానేడ్, సీల్దా మధ్య ఈస్ట్-వెస్ట్ అలైన్‌మెంట్ భాగం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. అయితే, సాల్ట్ లేక్ సెక్టార్ V నుండి సీల్దా భాగం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మెట్రో ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. అంటే బటన్‌ను నొక్కిన తర్వాత రైలు ఆటోమేటిక్‌గా తదుపరి స్టేషన్‌కు వెళుతుంది. ఈస్ట్-వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కిలోమీటర్లలో, 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉన్నాయి. ఇందులో హుగ్లీ నది కింద సొరంగం ఉంది. మిగిలినవి భూమిపైన ఉన్నాయి.
కోల్‌కతా మెట్రో జూన్, జూలైలో సాల్ట్ లేక్ సెక్టార్ V, హౌరా మైదాన్ మధ్య మొత్తం తూర్పు-పశ్చిమ మార్గం కోసం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ రవాణా రంగం అభివృద్ది దిశలో సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ జలాంతర్గ మెట్రో సేవలు మరింతగా భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.