జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని పవన్ అన్నారు. 2019లో వైసీపీ వెన్నంటి ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టాడని ఆరోపించారు. బీసీల గర్జన పేరుతో ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారని, బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి గాలికొదిలేశారని ఆరోపించారు.
బడ్జెట్లో మూడో వంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పి పూర్తిగా విస్మరించారని పవన్ దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బీసీ యువకుడిని వైసీపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారని ఆరోపించారు. బీసీ సోదరులు ఒకసారి పునరాలోచించుకోవాలని, గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకు వస్తే ఇబ్బంది పడతారని అన్నారు.
ఎస్సీ,ఎస్టీల పరిరక్షణ చట్టం మాదిరి వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరం అని చెప్పారు. ఆ చట్టాన్ని ఈ డిక్లరేషన్ లో తెచ్చారని, దానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. జనసేనకు సంబంధించినంత వరకు బీసీలకు సంబంధించి రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. బీసీ కులాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అన్నారు. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతీసంప్రదాయాలకు వెన్నెముక అని, బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశాన్ని ఊహించుకోలేమన్నారు.